అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ ముహూర్తాన మూడు రాజధానుల గురించి ప్రకటన చేశారో ఆరోజు నుండి ఏపీ రాజకీయ వర్గాల్లో రాజధాని అంశం హీట్ పెంచుతోంది. ఇటు ప్రజల్లోను, అటు రాజకీయ నేతల్లోను మూడు రాజధానుల ప్రకటన గురించే చర్చ జరుగుతోంది. మూడు రాజధానులలో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయ్యే అవకాశం ఉందని జగన్ చెప్పటంతో ప్రజలు అందరూ రాజధాని విశాఖకు తరలిపోతుందని అభిప్రాయపడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని అమరావతి నుండి రాజధానిని తరలిస్తున్నట్టు జగన్ కానీ ఎవరూ కానీ చెప్పలేదని అన్నారు. జగన్ కు షాక్ ఇచ్చేలా కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రకటన చేసిన రోజునుండి ప్రజల్లో రాజకీయనేతల్లో కూడా రాజధాని విశాఖకు తరలిపోతుందని విశాఖ నుండే పరిపాలన సాగుతుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొడాలి నాని మాట్లాడుతూ అమరావతి నుండి రాజధాని తరలిపోదని మరో రెండు ప్రాంతాల్లో రాజధానులను ఏర్పాటు చేస్తే వికేంద్రీకరణలో భాగంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పును చంద్రబాబు 90 వేల కోట్ల రూపాయల నుండి 3,50,000 కోట్ల రూపాయలకు పెంచాడని అన్నారు. చంద్రబాబు రాజధానిని గ్రాఫిక్స్ లో చూపించారని ఆ గ్రాఫిక్స్ తో రాజధాని కట్టాలంటే 1,15,000 వేల కోట్లు అవసరమవుతాయని అన్నారు. మరోవైపు ప్రభుత్వం ప్రజల్లో రాజధాని అంశం గురించి నెలకొన్న సందేహాలను తుడిచిపెట్టటానికి హైపవర్ కమిటీని నియమించింది. 
 
మంత్రులు ఏ ఒక్కరికీ నష్టం కలగకుండా రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రతిపక్షాలు మాత్రం రాజధానిని తరలించి ప్రాంతాల మధ్య గొడవలు పెడుతున్నారని చెబుతున్నారు. రాజధాని విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ ఎంపీ సుజనా చౌదరి రాజధానిని అమరావతి నుండి తరలించటానికి వీలు లేదని అమరావతికి లక్ష కోట్ల రూపాయలు అవసరం లేదని ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తే చాలని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: