ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్‌ కు నూతన ఎండీగా మాదిరెడ్డి ప్రతాప్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. మాదిరెడ్డి ప్రతాప్ 1991 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన వ్యక్తి. ప్రభుత్వం ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్, ఎండీ స్థానం నుండి మాదిరెడ్డి ప్రతాప్ ను ఏపీఎస్ ఆర్టీసీ నూతన ఛైర్మన్ గా బదిలీ చేసింది. ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా అడుగులు వేయటంతో పాటు జనవరి 1వ తేదీ నుండి ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ రంగ ఉద్యోగులే అని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 
 
ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్, ఎండీగా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ్ కు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాదిరెడ్డి ప్రతాప్ ను ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ బాధ్యతలను చేపడుతున్న కృష్ణబాబుకు మినహాయింపునిచ్చారు. ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీలో సమూల మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. 
 
ఇందులో భాగంగానే మాదిరెడ్డి ప్రతాప్ ను ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. కొన్ని రోజుల క్రితం ఏపీఎస్ ఆర్టీసీ పాలకమండలి తమ సంస్థలో ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది. ఈ మేరకు తీర్మానం చేసింది. ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయాలని జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. 
 
కేబినేట్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఆమోదం తెలపగా విధివిధానాల గురించి నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోంది. ఆర్టీసీలో కేంద్రం వాటా కూడా ఉండటంతో విలీన అంశాన్ని బోర్డులో ఉన్న కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులకు ప్రభుత్వం తరపున అధికారులు వివరించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా ఇందుకు అంగీకారం తెలిపారని సమాచారం. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: