తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా కొత్త  కార్యదర్శి ఎవరనేది ఇంకా తెలియవలసి ఉంది. అయితే జోషీ అని పిలబడే శైలేంద్రకుమార్ జోషి. 1984 బ్యాచ్ కు చెందిన అధికారి. ఈయన అప్పటి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ స్దానంలో వచ్చారు. ఇకపోతే అప్పటి సీఎస్ పదవి రేసులో జోషి కంటే సీనియర్ అధికారి అయిన బి.పి. ఆచార్య, రాజీవ్ రంజన్ ఆచార్య, బినయ్ కుమార్, వీరితో పాటు బీఆర్ మీనా, శైలంద్ర కుమార్, అజయ్ మిశ్రా పేర్లు కూడా ఉండగా ఎస్. కె. జోషీ వైపే కేసీఆర్ మొగ్గు చూపారు.

 

 

ఇకపోతే ఇప్పుడు  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి పదవీ కాలం ముగియనున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎస్‌కే జోషి స్థానంలో కొత్త సీఎస్‌ను సోమవారం ఖరారు చేయనున్నారని సమాచారం.. కేసీయార్ ప్రస్తుతం మధ్యమానేరు పర్యటనలో ఉన్నారు. అనంతరం కరీంనగర్‌ నుంచి సోమవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నాక.. సీఎస్‌ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది. ఇందుకు గాను కొత్త సీఎస్‌ నియామకంపై మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే ప్రస్తుతం కొత్త సీఎస్‌ పదవికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్‌ మిశ్రా, సోమేశ్‌కుమార్‌ల పేర్లు పరిశీలనలో ఉండగా, అజయ్‌మిశ్రాకు సీనియారిటీ ఉండటం వల్ల మొదటి జాబితాలో స్థానం ఉంది.

 

 

కానీ వచ్చే జులై వరకే ఆయన పదవీకాలం ముగియనుంది.. ఇదిలా ఉండగా సోమేశ్‌కుమార్‌కు 2023 డిసెంబరు వరకు సర్వీసు ఉండటం సానుకూలంగా మారింది. ఇక సోమేశ్‌కుమార్‌ ను గనుక ఈ పదవిలో నియమిస్తే ఆయన వచ్చే శాసనసభ ఎన్నికలు ముగిసే వరకు సీఎస్‌గా కొనసాగే వీలుంది. ఈ క్రమంలో కొత్త సీఎస్‌ ఎంపికపై ముఖ్యమంత్రి ఇప్పటికే కసరత్తు చేస్తున్నారని తెలుస్తుంది. అజయ్‌మిశ్రాకు అవకాశం ఇచ్చి ఆ తర్వాత సోమేశ్‌కుమార్‌ను కొనసాగించడం, లేదా సోమేశ్‌కే నేరుగా అవకాశం ఇవ్వడమనే రెండు ప్రతిపాదనలను ప్రస్తుతం ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నట్లు తెలిసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: