బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి రాజకీయ దురుద్దేశంతోనే తిరుమల వ్యవహారాలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తిరుమలలో సుబ్రహ్మణ్యస్వామి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. టీటీడీలో టీడీపీ హయాంలో యథేచ్ఛగా అవినీతి చోటు చేసుకుందని అన్నారు. గడచిన ఐదు సంవత్సరాలలో టీటీడీ నుండి టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల గురించి ఆడిటింగ్ జరపాలని అన్నారు. టీటీడీ ఖర్చు చేసిన నిధులపై సిట్ కూడా వేయాలని డిమాండ్ చేశారు. 
 
సీఎం జగన్ టీటీడీ ఆచారాలను, సాంప్రదాయాలను సక్రమంగా అమలు చేస్తున్నారని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. ప్రస్తుతం టీటీడీ వ్యవహారాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయని సుబ్రహ్మణ్యస్వామి ప్రశంసించారు. వైవీ సుబ్బారెడ్డి క్రిస్టియన్ అని అవాస్తవాలను ప్రచారం చేశారని తిరుమలలో కొండపై చర్చి కడుతున్నారంటూ కొందరు దుష్ప్రచారం చేశారని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించటం కోసం కొందరు అవాస్తవాలతో కుయుక్తులు పన్నుతున్నారని అన్నారు. 
 
సుబ్రహ్మణ్యస్వామి 2019 ఎన్నికలలో ఓడిపోయిన పార్టీనే ఈ కుట్రలకు కారణమని అన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలను మతకలహాలు సృష్టించడానికే చేస్తున్నారని అన్నారు. అసత్య ప్రచారం చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిపై పరువు నష్టం దావా వేయాలని సూచనలు చేశారు. టీటీడీ ఉద్యోగులలో క్రిస్టియన్లు ఎక్కువమంది ఉన్నారన్న ఆరోపణలు వాస్తవం కాదని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. 
 
15వేల మంది ఉద్యోగులు టీటీడీలో పని చేస్తున్నారని వారిలో కేవలం 44 మంది మాత్రమే క్రిస్టియన్లు ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వం టీటీడీ నిధుల వ్యయంపై స్వతంత్ర ఆడిటర్ తో ఆడిటింగ్ చేయించలేదని విమర్శలు చేశారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో టీటీడీలో జరిగిన అవినీతిపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నానని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. ఈవో అనీల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి పనితీరు బాగుందని అన్నారు. రమణ దీక్షితులను శ్రీవారి ఆలయంలో పునర్నియమించటం పట్ల సుబ్రహ్మణ్యస్వామి సంతోషం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: