టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి ఇవాళ సీఎం వైఎస్ జగన్ ను కలవడం సంచలనం సృష్టించింది. గుంటూరు జిల్లాలో టీడీపీ గెలుచుకున్న అతికొద్ది స్తానాల్లో గుంటూరు పశ్చిమ ఒకటి.. అక్కడి నుంచి గెలిచిన మద్దాలి గిరి ఇప్పుడు టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే తాను నియోజక వర్గం అభివృద్ది పనుల కోసమే జగన్ ను కలిశానని చెబుతున్నారు మద్దాలి గిరి.

 

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సమస్యలను తాను ముఖ్యమంత్రికి వివరించానని ఆయన సీఎంను కలిసిన తర్వాత మీడియాతో చెప్పారు. తాను అడిగిన వెంటనే సీఎం 25 కోట్ల రూపాయలు అభివృద్ధి పనుల కోసం మంజూరు చేయాలని అధికారులను ఆదేశించినట్టు మద్దాలి గిరి చెప్పారు. మద్దాలి గిరి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటు ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలుసుకున్నారు.

 

ఇటీవలే కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఇదే తరహాలో ముందు జగన్ ను కలసి ఆ తర్వాత టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు అదే తరహాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను టీడీపీ ఎమ్మెల్యే గిరిధర్ రావు కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వల్లభనేని వంశీ ఇప్పటికే టీడీపీకి దూరంగా ఉంటూ శాసనసభలో తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించి, సీటు కేటాయించాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు ఇటీవల విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మద్దాలి గిరి కూడా అదే బాటలో పయనిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

 

ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గం సమస్యల కోసం ముఖ్యమంత్రిని కలవడం సాధారణంగా పెద్ద విషయం ఏమీ కాదు. కానీ మద్దాలి గిరి జగన్ ను కలిసిన నేపథ్యం ఆసక్తి రేపుతుంది. అందులోనూ వైసీపీ మంత్రి తాను తోడ్కోని వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేను సీఎంతో భేటీ చేయించడం ఇక్కడ ఇంట్రస్టింగ్ విషయం. ఈ పరిణామాలు టీడీపీ శిబిరంలో ఆందోళన కలిగించేవే. మరి ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: