తెలంగాణ‌లో జ‌రిగిన ఆర్టీసీ స‌మ్మెకు త‌న‌దైన శైలిలో చెక్ పెట్టి అనంత‌రం ప‌లు కొత్త ట్రెండ్‌ల‌కు సీఎం కేసీఆర్ శ్రీ‌కారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. ఆర్టీసీ కార్మికుల‌తో భోజనం, అనంత‌రం వారితో చ‌ర్చ‌లు జ‌రిపి వ‌రాల జ‌ల్లు కురిపించ‌డం, వ‌న‌భోజ‌నాలు చేయాల‌ని ఆదేశించ‌డం వంటివి తెలిసిన సంగ‌తే. ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట‌ను తాజాగా ఇద్ద‌రు మంత్రులు ఫాలో అయ్యారు. శామీర్‌పేటలో నిర్వహించిన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా జేబీఎస్‌లో ప్రదర్శనకు ఉంచిన కార్గో బస్సుతోపాటు సంచార బయో టాయిలెట్స్‌ను పరిశీలించి జేబీఎస్‌ నుంచి శామీర్‌పేట వరకు ఇద్దరు మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్‌, మల్లారెడ్డి, ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి వనభోజనం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి  మంత్రులు, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి , ఆర్టీసీ ఇన్‌చార్జీ ఎండీ, ఈడీలు కలిసి వనభోజనం చేసిన అనంతరం శామీర్‌పేట బస్టాండ్‌లో మొక్కలు నాటారు. అనంతరం మొబైల్‌ బయో టాయిలెట్‌ను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. 

 

అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ...ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో ఉద్యోగులతో భోజనం చేసి కొత్త సంప్ర‌దాయానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. సంస్కరణల దిశగా ఆర్టీసీ ప్రయాణిస్తున్నదని, అందులోభాగంగానే హకీంపేట డిపోకు చెందిన ఉద్యోగులతో కలిసి వనభోజనం ప్రారంభించినట్లు తెలిపారు.ఆర్టీసీలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభమైందని మంత్రి పువ్వాడ అన్నారు. ఉద్యోగులు, అధికారులు అనే తేడా లేకుండా కలిసి భోజనం చేయడం సంతోషకరమని అన్నారు. ఆర్టీసీకి ఘనమైన చరిత్ర ఉందని, తెలంగాణ ప్రజలతో విడదీయరాని అనుబంధం ఉందని అన్నారు. 10 వేల బస్సులతో లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నట్లు చెప్పారు. ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, టికెట్‌ లేకుండా ప్రయాణిస్తే ప్రయాణికుడినే బాధ్యత చేశామని, కండక్టర్లపై చర్యలు ఉండవని స్పష్టం చేశారు.

 

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాత్రి 8 గంటల తర్వాత మహిళా ఉద్యోగులకు డ్యూటీలు వేయడం లేదని మంత్రి చెప్పారు. సమ్మె సమయంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చామని, ఎక్స్‌గ్రేషియా చెల్లించినట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచారని తెలిపారు. ఉద్యోగులను చిన్న చిన్న తప్పులతో ఉద్యోగం నుంచి తొలిగించే ప్రసక్తే లేదన్నారు. ప్రతీనెలా 5వ తేదీలోగా జీతాలు చెల్లిస్తామని, సీసీఎస్‌ బకాయిలు విడతలవారీగా చెల్లించడం జరుగుతుందని, అతి త్వరలో శుభవార్త వింటారని చెప్పారు. సమ్మె కాలంలో రెండు నెలల జీతం ఒకేసారి ఇస్తామని, మహిళా కండక్టర్లకు మెరూన్‌ కలర్‌ ఆఫ్రాన్‌ ఇస్తామని చెప్పారు. ఓఆర్‌ పెంచి ప్రతీ డిపోను దత్తత తీసుకుని లాభాల్లోకి తీసుకురావాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: