సీఏఏకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిపై యూపీ ప్రభుత్వ చర్యల్ని ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. మరోవైపు లక్నో ఎపిసోడ్ ను ప్రస్తావించిన ప్రియాంక.. తన భద్రత కంటే ప్రజల భద్రతే ముఖ్యమని స్పష్టం చేశారు. 

 

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా యూపీలో నిరసనలు గట్టిగా జరుగుతున్నాయి. నిరసనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో.. వారిని పరామర్శించేందుకు ప్రియాంక గాంధీ రెండు రోజుల క్రితం లక్నోలో బైక్ రైడ్ చేశారు. అయితే కేంద్రం తీసుకొచ్చిన కొత్త మోటారు వాహనాల చట్టం ప్రకారం.. బైక్ నడిపేవారితో పాటు వెనక కూర్చునే వారు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. యూపీలో ఈ రూల్స్ గా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. దీంతో హెల్మెట్ లేకుండా బైక్ పై వెనక కూర్చున్న ప్రియాంకను ఆపేశారు పోలీసులు. ఫైన్ కూడా వేశారు. 

 

అయితే పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. దీనికి కౌంటరిచ్చిన బీజేపీ.. ప్రియాంకే పోలీసులపై దౌర్జన్యం చేశారని ఆరోపించింది. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసన తెలిపిన కార్యకర్తలపై ఉత్తరప్రదేశ్ పోలీసుల చర్యను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మరోసారి తప్పుపట్టారు. యూపీ పోలీసుల చర్యపై తమ పార్టీ హైకోర్టుకు వెళ్తుందని చెప్పారు. నిరసనకారులపై ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని, నిరసనలతో ప్రమేయమున్న వ్యక్తుల ఆస్తులను జప్తు చేస్తామని సీఎం స్వయంగా ప్రకటించారని ప్రియాంక గుర్తుచేశారు. 

 

తన భద్రత అనేది పెద్ద అంశం కాదని, అది చాలా చిన్న విషయమని ప్రియాంక చెప్పారు. దానిపై చర్చించాల్సిన అవసరం లేదని కూడా తెగేసి చెప్పారు. యూపీ పోలీసులు తీసుకుంటున్న చర్యలు చట్టబద్ధం కావని, ఇవి అరాచకానికి దారితీస్తాయని ప్రియాంక పేర్కొన్నారు. మొత్తానికి ప్రియాంకా గాంధీ కోపంతో రగిలిపోయింది. తనపై ఉండే కోపాన్ని సామాన్యులపై తీర్చుకుంటారా అంటూ మండిపడింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: