ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పై ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వల్లే రాష్ట్రం అధోగతిపాలైందని, తన ఐదేండ్ల పాలనలో ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప ఆయన చేసిందేమీ లేదని, ఇప్పుడు అమరావతిని అడ్డంపెట్టుకుని చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం సీఎం జగన్ తో భేటీ ముగిసిన వెంటనే మద్దాలి ఈ తరహా కామెంట్లు చేయడం గమనార్హం.


గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తరహాలోనే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌రావు కూడా నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసమే ముఖ్యమంత్రి జగన్ ను కలిశానని మీడియాకు వివరించారు. గుంటూరు సిటీతోపాటు వెస్ట్ నియోజకవర్గంలో డెవలప్మెంట్ పనుల గురించి అడగ్గా.. సీఎం సానుకూలంగా స్పందించారని, వెంటనే రూ. 25 కోట్ల నిధుల విడుదలకు ఆదేశిస్తానని సీఎం ప్రామిస్ చేసినట్లు మద్దాలి తెలిపారు.


విభజన తర్వాత ఐదేండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడి తీరు వల్లే రాష్ట్రంలో సమస్యలు పెరిగిపోయానని టీడీపీ ఎమ్మెల్యే ఆరోపించారు. కలల రాజధాని కడతానని ఐదేండ్ల పాటు అమరావతి రైతుల్ని బాబు మోసం చేశారని, అన్ని ప్రాంతాల్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో సీఎం మూడు రాజధానుల ప్రతిపాదన తెస్తే దానికి కూడా బాబు అడ్డుపడుతున్నారని విమర్శించారు. పేద పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించాలన్న మంచి ఉద్దేశాన్ని కూడా చంద్రబాబు తప్పు పట్టడాన్ని భరించలేకపోయానని మద్దాలి అన్నారు.


రాష్ట్రంలో డెవలప్మెంట్ అంటూ ఏదైనా జరిగిందంటే నాటి వైఎస్సార్ తర్వాత జగన్ హయాంలోనేనని, మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చూడబోతున్నామని టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి అన్నారు. కాగా, టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరుతున్నారా? అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం దాటవేశారు. సీఎం జగన్ చేస్తున్న మంచి పనులకు ఆకర్షితుణ్ణై మర్యాదపూర్వకంగా కలిశానని, రాజీనామా ప్రస్తావన ఇప్పుడు అనవసరమని మద్దాలి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: