రాష్ట్రం లో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదనను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ , అమరావతి ని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తోంది . అయితే అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్న టీడీపీ డిమాండ్ లో పస లేదని నిరూపించడానికి అన్నట్లు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది .

 

రాజధాని ప్రభావిత  ప్రాంతమైన గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన టీడీపీ  ఎమ్మెల్యే మద్దాల గిరి తమ వైపు తిప్పుకోవడం ద్వారా , ఆ పార్టీ చేస్తోన్న ఆందోళనలు , నిరసన కార్యక్రమాలను  ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదన్న  సంకేతాలను పంపే ప్రయత్నం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేసినట్లు   స్పష్టమవుతోంది .  ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ , టీడీపీ కి    గుడ్ బై చెప్పి  జగన్ కు జై కొట్టిన విషయం తెల్సిందే . ఇక ఇప్పుడు మద్దాల గిరి కూడా ఆ పార్టీని వీడడం ఖాయమని తేలిపోయింది .

 

 దీనితో అసెంబ్లీ లో  టీడీపీ సభ్యుల  బలం 22 కి పడిపోయినట్లయింది . త్వరలోనే విశాఖ కు చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు , రాజధానిపై టీడీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైస్సార్ కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది . అదే జరిగితే అసెంబ్లీ లో టీడీపీ సభ్యుల బలం మరింత తగ్గే అవకాశాలున్నాయి . దాంతో టీడీపీ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు .

 

 ఒక వైపు రాజధాని అమరావతి పరిధిలోని ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడం ద్వారా టీడీపీ చేస్తోన్న ఆందోళనలు అర్ధరహితమన్న సంకేతాలను ప్రజల్లోకి పంపడమే కాకుండా , తమ ప్రాంత అభివృద్ధి ని చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారన్న సాకు తో విశాఖ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడం ద్వారా టీడీపీ అధినేతను రెంటికి చెడ్డ రేవడి చేయాలన్న యోచనతో జగన్ ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: