రాజధాని వ్యవహారం లో కమలనాథులు  ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతూ ప్రజల్లో అభాసుపాలవుతున్నారు . పార్టీ విధానం ఏమిటన్నది సామాన్య  ప్రజలకే కాదు ... పార్టీ క్యాడర్ కూడా అంతుచిక్కని పరిస్థితి నెలకొంది . ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ప్రతిపాదించిన విషయం తెల్సిందే . ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడమా?, సమర్ధించడమా??  అన్న అంశంపై   రాష్ట్ర బీజేపీ నేతల్లో ఏకాభిప్రాయం కొరవడినట్లు స్పష్టం అవుతోంది .

 

 అమరావతిని రాజధానిగా కొనసాగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ , రాజ్యసభ్యుడు సుజనా చౌదరి  పేర్కొంటుండగా , విశాఖ రాజధాని అయితే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రాజు అన్నారు . అధికార వికేంద్రీకరణ కాదు , అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలంటున్న బీజేపీ నేతలు మరోసారి రాజధాని వ్యవహారం లో తమలో తమకే సఖ్యత లేదని చెప్పకనే చెప్పారు . రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుంటే కేంద్రం చూస్తూ ఊరుకోదని సుజనా చౌదరి పేర్కొన్న విషయం తెల్సిందే .

 

 నిజమే కాబోలు కేంద్రం జోక్యం చేసుకుంటుందేమోనని అందరు  భావిస్తున్న తరుణం లో ...  ఏపీ రాజధాని అంశం కేంద్ర పరిధిలో లేదని మరొక రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్సింహారావు  వ్యాఖ్యానించారు . రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలో కేంద్రం సూచించలేదని ,అలాగే రాజధాని మార్చాలని కూడా కేంద్రం చెప్పదని జివిఎల్ చెప్పుకొచ్చారు . అవసరమైతే సలహానిస్తుందని అన్నారు . ఇదే తరహా వ్యాఖ్యలను మరొక రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేయడం హాట్ టాఫిక్ గా మారింది . రాజధాని వ్యవహారం లో జాతీయ పార్టీ నేతలు ఒక విధానమంటూ లేకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతుండడం వల్ల క్యాడర్ గందరగోళానికి గురవుతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: