కొత్త సంవత్సరానికి కొత్త ఆశలతో ప్రతి ఏటా స్వాగతం పలుకుతాం.. కానీ ఈ ఏడాది మరీ స్పెషల్ ఎందుకంటే.. కొత్త ఏడాదే కాదు.. కొత్త దశాబ్దం కూడా కదా. మరి ఈ హ్యాపీ మూమెంట్ ను ఓ కేక్ తో సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ మార్కెట్ లో దొరికే కేక్ లో నాణ్యత కు గ్యారంటీ లేదు. అందుకే ఇంట్లనోనే చేసుకోవచ్చు.

 

ఎలాగో చూద్దాం.. ఇందుకు కావలసినవి మైదా: కప్పు, ఉప్పు: పావుచెంచా, చక్కెర: అరకప్పు, చాక్లెట్‌పొడి, వెన్న, నూనె,పెరుగు, నీళ్లు: పావుకప్పు చొప్పున, వెనిగర్‌, వెనిల్లా ఎసెన్స్‌: చెంచా చొప్పున,వంటసోడా: అరచెంచా. ఐసింగ్‌ కోసం: చాక్లెట్‌పొడి, వెన్న, పాలు: పావుకప్పు చొప్పున,బ్రౌన్‌ షుగర్‌: అరకప్పు, వెనిల్లా ఎసెన్స్‌: చెంచా.

 

కేక్‌పాన్‌కి కొద్దిగా వెన్న రాసుకుని పెట్టుకోవాలి. ఓ గిన్నెలో మైదా, ఉప్పు, చక్కెర తీసుకుని అన్నింటినీ కలిపి పెట్టుకోవాలి. మరో గిన్నెలో వెన్న, నూనె, చాక్లెట్‌పొడి, నీళ్లు తీసుకుని అన్నింటినీ కలిపి స్టవ్‌మీద సిమ్‌లో పెట్టాలి. ఇది చిక్కగా అయ్యాక దింపేసి మైదాలో వేయాలి. ఇంకో గిన్నెలో పెరుగు, పావుకప్పు నీళ్లు, వెనిగర్‌, వెనిల్లా ఎసెన్స్‌, వంటసోడా కలిపి మైదా మిశ్రమంలో వేసి... అన్నింటినీ బాగా కలిపి కేక్‌పాన్‌లోకి తీసుకోవాలి.

 

ముందుగా వేడిచేసుకున్న ఒవెన్‌లో ఈ కేకు పాత్రను ఉంచి ముప్పైఅయిదు నుంచి నలభైనిమిషాల వరకూ బేక్‌ చేసుకుని తీసుకోవాలి. ఒవెన్‌ లేకపోతే... ఆరులీటర్ల కుక్కర్‌లో కప్పు ఉప్పు వేసి సన్నని మంటపై పెట్టాలి. కుక్కర్‌ వేడయ్యాక ఈ కేకు పాత్రను అందులో ఉంచి మూత పెట్టాలి. విజిల్‌ మాత్రం పెట్టకూడదు. నలభైఅయిదు నిమిషాలకు కేక్‌ తయారవుతుంది.

 

ఇప్పుడు ఐసింగ్‌ తయారు చేసుకోవాలి. ఓ పాన్‌లో వెన్న, వెనిల్లా ఎసెన్స్‌, బ్రౌన్‌షుగర్‌, పాలు, చాక్లెట్‌పొడి తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. ఈ మిశ్రమం చిక్కగా అయ్యాక దింపేసి కేకుపై సమానంగా పరిస్తే చాలు. న్యూ ఇయర్ కేక్ రెడీ.. ఈ సారి మీరే ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: