మూడు రాజధానుల వ్యవహారంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ కేంద్రానికి భయపడ్డాడని, అందుకే వెనకడుగు వేస్తున్నారంటూ టిడిపి, ఏపీ బీజేపీ నాయకులు అదేపనిగా ప్రచారం మొదలుపెట్టారు. దీనికి మద్దతుగా కొన్నిటీడీపీ అనుకూల మీడియా సంస్థలు కూడా వీరి మాటలను హైలెట్ చేస్తూ అనేక కథనాలు వండి వారుస్తున్నాయి. కేంద్రం నుంచి జగన్ కు గట్టిగానే వార్నింగ్ వచ్చింది అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి సురేష్ ప్రభు వచ్చి జగన్ కు గట్టిగా క్లాస్ పీకారనే ప్రచారం టిడిపి అనుకూల మీడియా చేపట్టింది. నిజంగానే జగన్ కేంద్రానికి భయపడుతున్నారా ? కేంద్రం నిజంగానే జగన్ ను భయపెడుతుందా అంటే ఇందులో ఎక్కడా వాస్తవం కానీ, దానికి తగిన ఆధారాలు కానీ దొరకడం లేదు.


 టిడిపి నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మాత్రమే రాజధాని వ్యవహారంలో అందరికంటే ఎక్కువగా బాధపడిపోతున్నారు. అమరావతి చుట్టు పక్కల ప్రాంతాల్లో బినామీ పేర్లతో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సుజనాచౌదరి దానికి తగ్గట్టుగానే అమరావతి నుంచి రాజధాని వేరు చేస్తున్నారనే బాధ ఆయనలో ఎక్కువగా కనిపిస్తోంది. నిజంగా కేంద్రానికి జగన్ భయపడి ఉంటే విశాఖకు 1200 కోట్ల పైగా నిధులను కేటాయించేవాడు కాదు. భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి ఉండేవారు కాదు. నిజంగా జగన్ భయపడి ఉంటే రాజధాని వ్యవహారంపై హై పవర్ కమిటీ ని నియమించి ఉండేవారు కాదు. ఒకవేళ నియమించినా దానికి మూడు వారాలు గడువు కాకుండా ఆరు నెలలో, సంవత్సరమో గడువు విధించి ఈ వ్యవహారాన్ని సాగదీసి ఉండేవారు. కానీ జగన్ అలా ఎక్కడా చేయలేదు. 


మూడు వారాల్లో జీఎన్ రావు  కమిటీ, బోస్టన్ నివేదికపై అధ్యయనం చేయమని చెప్పేవారు కాదు. అలాగే జగన్ విశాఖ ఉత్సవ్ వెళ్ళినప్పుడు ఆయనకు జనాలు స్వాగతం పలికి ఉండేవారు కాదు. విశాఖ ఉత్సవ్ లో జగన్ సమక్షంలో ప్రదర్శించిన వీడియో లో కూడా విశాఖను రాజధానిగా చేస్తున్నారనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించింది. ఇక కేంద్ర మంత్రి సురేష్ ప్రభు జగన్ కు నిజంగానే వార్నింగ్ ఇచ్చి ఉంటే ఆయన సతీ సమేతంగా జగన్ కుటుంబాన్ని కలిసి ఉండేవారు కాదు. ఇప్పుడు హడావుడి చేస్తున్న ఏపీ బీజేపీ నాయకులు తమ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగానో, ఇతర కారణాలతోనే జగన్ భయపెట్టేందుకు కేంద్రాన్ని బూచిగా చూపిస్తున్నారు తప్ప నిజంగా కేంద్రం ఈ విషయంలో పెద్దగా జోక్యం చేసుకునేందుకు ఇష్టపడడం లేదు.


 దేశంలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. ఒక్కో రాష్ట్రం బీజేపీకి దూరం అవుతూ వస్తోంది. ఈ తరుణంలో కేంద్రం ప్రవేశ పెట్టే ప్రతి బిల్లుకు వైసిపి పార్లమెంటులో మద్దతు తెలుపుతోంది. ఇటువంటి సమయంలో వైసీపీని దూరం చేసుకునేందుకు బిజెపి ఇష్టపడదు. కేవలం బీజేపీలో చేరిన చంద్రబాబు కు అత్యంత సన్నిహితులైన వ్యక్తులు మాత్రమే జగన్ కేంద్రానికి బయటపడ్డారు అంటూ చెప్పుకుంటూ హడావుడి చేస్తున్నారు తప్ప ఇందులో నిజమే లేదు అనే విషయం అందరికీ అర్థమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: