ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నగరంలో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అతి వేగం కారణంగానే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొందరు డ్రైవర్ల నిర్లక్ష్యం వలన అమాయకులు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈరోజు అభం శుభం తెలియని ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 
 
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ చౌరస్తా దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీ కొట్టడంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులకు స్థానికుల నుండి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడినవారిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్కూల్ విద్యార్థులతో వెళుతున్న ఆటోను ఇసుక లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. 
 
భాష్యం స్కూల్ లో ఏడో తరగతి చదివే విద్యార్థి అవంతి కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన విద్యార్థి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆరుగురు విద్యార్థులు ఆటోలో భాష్యం స్కూల్ కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ భారీ వేగంతో వచ్చి ఢీ కొట్టడంతో ఆటో నుజ్జునుజ్జు అయింది. లారీ ఆటోను ఢీ కొట్టడంతో ఆటో నుండి విద్యార్థులు కింద పడిపోయారు. ఒక విద్యార్థి లారీ టైరు కింద పడటంతో మెదడు చిట్లిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
పోలీసులు విద్యార్థి అవంతికుమార్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆటోలో ఉన్న మిగతా విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. చికిత్స పొందుతున్న ఐదుగురు విద్యార్థుల పరిస్థితి కూడా విషమంగానే ఉందని తెలుస్తోంది. ఒక విద్యార్థి మృతి చెందటం, ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడటంతో విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవతున్నారు. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: