అమరావతిలో రైతుల ధర్నా, కన్నా లక్ష్మీనారాయణ మౌనదీక్షను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి చేయడం కలకలం రేపింది. ఈ దాడిలో మహిళా జర్నలిస్టులు కూడా గాయపడ్డారు.

అయితే సాధారణంగా ఇలాంటి దాడులు జరిగినప్పుడు వర్గాలకు అతీతంగా మీడియా అంతా ఒక్కటవుతుంది. నిరసనలు తెలుపుతుంది. ర్యాలీలు నిర్వహిస్తారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు.

 

కానీ విచిత్రంగా మొన్నటి మీడియాపై దాడి తర్వాత అలాంటి సీన్ కనిపించలేదు. ఈ తీరును ఏపీ సమాచారశాఖ మంత్రి ప్రశ్నించారు. తోటి జర్నలిస్టులపై విచక్షణారహితంగా దాడులు చేస్తే పత్రికా సమాజం, సంఘాలు ఏమయ్యాయని మంత్రి పేర్ని నాని నిలదీశారు. మీడియాలో పని చేస్తున్న కొందరు విలేకరులపై విచక్షణరహితంగా దాడి చేస్తే..మిగతా విలేకరులు ఏం చేస్తున్నారు. హీనాతిహీనంగా దాడులు చేస్తున్నా కొందరు పాత్రికేయులు పట్టించుకోకపోవడం బాధాకరం.. అంటూ మీడియా తీరును కడిగేశారు.

 

అక్రిడేషన్‌ పాసుల కోసం మీడియా సంఘాలు వస్తాయి. కానీ పాత్రికేయులపై దాడి చేస్తే నోరు మెదపడం లేదు. తప్పుడు వార్తలు రాస్తే..వివరణ ప్రచురించాలి. లేదంటే లీగల్‌గా పరువు నష్టం వేసే అధికారం కల్పిస్తూ ఓ జీవో ఇస్తే బజారు ఎక్కి పోరాటం చేసిన వాళ్లు..మీ తోటి ఉద్యోగులపై దాడి చేస్తే..ఏమైంది పత్రికా సమాజం. టీవీ 9 దీప్తి, ఎన్‌టీవీ హరిష్‌, మహాటీవీ వసంత, కెమెరా మెన్స్, వారి కారు డ్రైవర్లను చితకకొట్టారు. ఈ దాడిని ఖండించకపోవడం బాధాకరం.. అన్నారు నాని.

 

దాడిలో గాయపడిన వారికి అండగా ప్రభుత్వం ఉంటుంది. మీరు స్థైర్యాన్ని కోల్పోవద్దు. మీపై దాడి చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆడపిల్లను క్రురంగా కర్రలతో కొడితే..సానుభూతి చూపకుండా..చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్‌ దాడి చేసిన వారికి సపోర్టు చేస్తున్నారు. చింతమనేని ప్రభాకర్‌ ఇంటికి వెళ్లిన చంద్రబాబు..టీడీపీ నేతలకు ఇదే స్ఫూర్తితో పని చేయమని పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రవర్తనను ఖండిస్తున్నామన్నారు పేర్ని నాని.

మరింత సమాచారం తెలుసుకోండి: