విశాఖ టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మార్పు వ్యవహారం చాలా కాలంగా నలుగుతూనే ఉంది. ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ గంటా రాజకీయ నేపథ్యం తెలిసిన జగన్ ఆయన  చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా దూరం పెడుతూ వస్తున్నారు. అయితే వైసీపీ లో చేరడం కుదరకపోతే బిజెపిలోకి వెళ్లాలనే ఆలోచనతో ఇప్పటి వరకు వేచి చూసిన గంటా తనకంటూ కొంత మంది ఎమ్మెల్యేలతో ఒక టీంను ఏర్పాటు చేసుకున్నారు. ఆ టీమ్ తో కలిసి బిజెపిలో చేరి తాను కీలక పదవిని తీసుకోవాలని భావించినట్లుగా వార్తలు వినిపించాయి. అయితే అక్కడ ఏమైందో ఏమో కానీ కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయారు. 


ఇక వైసీపీ అధినేత జగన్ మూడు రాజధానులు ప్రకటించడం, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా నిర్ణయించడంతో జగన్ నిర్ణయానికి కి గంట జై కొట్టారు. దీంతో అందరూ ఆయన వైసీపీ లోకి వచ్చేస్తున్నారు అని భావించారు. తాజాగా ఈరోజు ఆ విషయంపై స్పందించిన గంటా శ్రీనివాసరావు తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని, తెలుగుదేశం పార్టీలోనే ఉంటున్నాను అంటూ ప్రకటించారు. విశాఖను పరిపాలన రాజధానిగా జగన్ ప్రకటించడాన్ని స్థానికుడిగా ఇప్పటికీ మద్దతు పలుకుతున్నానని, తనకు విశాఖ నగరం అంటే ఎంతో ఇష్టం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడే తన మార్క్ రాజకీయానికి గంటా పదును పెట్టారు. 


అమరావతిలో రాజధాని రైతులను బాధపెట్టి విశాఖకు రాజధాని తరలించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు గా మాట్లాడారు. అలాగే తమ అధినేత చంద్రబాబు సూచనల మేరకు కొత్త సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటాను అంటూ ప్రకటించారు. వాస్తవంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ చేసే గంటా ఇప్పుడు ఉనికి కోల్పోతున్న తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని చెబుతుండడం వెనుక రాజకీయ కారణాలు ఏంటా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: