మరాఠీ, కన్నడిగుల మధ్య సరిహద్దు సమస్య రగిలింది. చారిత్రక వైభవం కలిగి, అత్యంత వేగంగా పురోగమిస్తున్న బెలగావిపై.. ఇరు రాష్ట్రాలు వాదులాటకు దిగుతున్నాయి. మహారాష్ట్రకు ఒక్క ఇంచి కూడా వదిలేది లేదన్న కర్ణాటక సీఎం యడియూరప్ప ప్రకటన.. ఇరురాష్ట్రాల మధ్య నిప్పు రాజేసింది. 

 

బెలగావి.. దీన్ని పూర్వకాలంలో వేణుగ్రామం, వెదురు గ్రామం అని పిలిచేవారు.  పశ్చిమ కనుమలకు సమీపంలో అత్యంత ప్రాచీన సంస్కృతి కలిగిన ప్రదేశమిది. కాటన్, సిల్క్ పరిశ్రమలతో అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులేస్తోంది. ఇది కర్ణాటక, మహారాష్ట్ర, గోవాల మధ్య రిచ్ కల్చర్ తో వెలుగొందుతోంది. ప్రస్తుతం బెలగావి.. కర్ణాటకలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లా . ఈ జిల్లాకు సంబంధించి మహారాష్ట్ర, కర్ణాటక మధ్య చాలా ఏళ్లుగా సరిహద్దు సమస్య ఉంది. కొన్నాళ్లు ముంబై ప్రెసిడెన్సీలో ఉన్న బెలగావి.. తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్ర్రంలో భాగంగా కర్ణాటకలో చేరింది.

 

మొన్నటి వరకూ మహారాష్ట్ర, కర్ణాటకల్లో బీజేపీ ప్రభుత్వం ఉండడంతో.. ఇరు రాష్ట్రాలు సామరస్యపూర్వకంగా సాగాయి. అయితే తాజా ఎన్నికల్లో మహారాష్ట్రలో ప్రభుత్వం మారి.. శివసేనకూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే.. సరిహద్దు సమస్యపై మంత్రుల కమిటీని వేశారు. ఈ కమిటీ తన పనిని చకచకా చేసుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం కూడా రియాక్టైంది.  

 

బెలగావికి సంబంధించి ఒక్క ఇంచి భూభాగాన్ని కూడా మహారాష్ట్రకు ఇచ్చేది లేదని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధికోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి గందరగోళం సృష్టిస్తున్నారని..  ఒక్క ఇంచీ స్థలం కూడా వదిలేది లేదన్నారు యడ్యూరప్ప. మరాఠీ, కన్నడిగుల మధ్య వివాదాలు రేపేందుకు యత్నిస్తున్నారన్నారు.

 

ఈ వివాదం మొదలైన తర్వాత పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో కొల్హాపూర్ నుంచి కర్ణాటకకు బస్సు సర్వీసులు నిలిపివేశారు. కర్ణాటక సైతం బెలగావి నుంచి కొల్హాపూర్ కు బస్సు సర్వీసులు నిలిపివేసింది. దీనితో కొల్హాపూర్‌లో శివసేన కార్యకర్తలు... కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, హోంమంత్రి బసవరాజ్ బొమ్మై దిష్టిబొమ్మలు తగులబెట్టారు. కన్నడ సినిమాల ప్రదర్శనను అడ్డుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: