రాజధాని తరలింపుపై ఓ వైపు రగడ నడుస్తుంటే...జనసేనాని కూడా రైతులకు మద్దతుగా ఆందోళనలకు పూనుకున్నారు. ఇప్పటికే  పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో దీనిపై చర్చించిన పవన్... రాజధాని గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. 

 

ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారుస్తామంటే ఎలా అంటూ.. ప్రశ్నించారు జనసేన అధినేత ప్రవన్‌ కళ్యాణ్. పాలకుల అనాలోచిత నిర్ణయాలు ప్రాంతాల మద్య చిచ్చు పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ నేతలతో సమావేశమైన ఆయన... రాజధానిపై నేతలు ఇచ్చిన నివేదికపై లోతుగా చర్చించారు. అలాగే నాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో అమరావతిని రాజధానిగా ఒప్పుకున్న వైఎస్ జగన్.. అధికారం వచ్చాక ధర్మం తప్పారని మండిపడ్డారు పవన్‌. రాజధాని అమరావతిలో వద్దని అప్పుడు అసెంబ్లీలో జగన్ చెప్పలేదని, ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మార్చుతామంటే ఎలా? అని ప్రశ్నించారు జనసేన అధినేత.

 

సీఎం జగన్‌ తీసుకొచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించిన పవన్‌... కేబినెట్‌ నిర్ణయం తర్వాతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. అయితే రాజధానిపై కేబినెట్‌ ఏమీ తేల్చకపోవడంతో పవన్‌ తన కార్యాచరణను ప్రారంభించినట్టు తెలుస్తోంది. రాజధాని రైతులకు భరోసా ఇచ్చేందుకు.. వారితో కలిసి అమరావతి కోసం పోరాడేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తున్నారు.  

 

ఈ రోజు మంగళగిరి పార్టీ ఆఫీసు నుంచి పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభమైంది. అక్కడ్నించి ఎర్రపాలెం, మందడం, వెలగపూడి, తుళ్ళూరు ప్రాంతాల మీదుగా అమరావతి యాత్ర చేస్తున్నారు. తన పర్యటలో రైతులు, రైతు కూలీలతో ముఖాముఖీ కలుస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాజధాని ప్రాంతంలో చేపట్టిన వివిధ పనులను పరిశీలిస్తున్నారు. 


మరోవైపు.. పవన్ కల్యాణ్ అమరావతిలో పర్యటిస్తుండటంతో.. అంతకుముందే అమరావతి పరిరక్షణ సమితి నేతలు మంగళగిరి జనసేన కార్యాలయానికి వచ్చి ఆయనతో భేటీ అయ్యారు. 13 రోజులుగా తాము అమరావతి కోసం ఉద్యమిస్తున్నా.. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు జేఏసీ నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: