తెలంగాణ రాష్ట్ర కొత్త సీఎస్ గా సోమేష్ కుమార్ ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. సోమేష్ కుమార్ కాసేపట్లో కొత్త సీఎస్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఎస్ జోషీ పదవీ విరమణ చేసినట్లు సమాచారం అందుతోంది. సోమేష్ కుమార్ పదవీకాలం 2023 సంవత్సరం వరకు ఉండనుంది. 14 మంది సీనియర్ ఐఏఎస్ లు ఉండటంతో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించి సీఎస్ గా సోమేష్ కుమార్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 
 
1989 బ్యాచ్ కు సంబంధించిన అధికారి సోమేష్ కుమార్ ముఖ్య కార్యదర్శుల పదవులు చేపట్టారు. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా సీఎస్ గా అజయ్ మిశ్రా ఎంపికయ్యే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపించాయి. కానీ కేవలం ఆరు నెలల పదవీకాలం మాత్రం అజయ్ మిశ్రాకు ఉండటంతో ప్రభుత్వం సోమేష్ కుమార్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. వాస్తవానికి సోమేష్ కుమార్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. 
 
కానీ సోమేష్ కుమార్ తాను తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగుతానని కేంద్రానికి అర్జీ పెట్టుకొని కమర్షియల్, ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. సీనియర్ ఐఏఎస్ లు ఉన్నప్పటికీ వారిని కాదని కేసీఆర్ సోమేష్ కుమార్ వైపే మొగ్గు చూపారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలకు అనుగుణంగా నిబద్ధతతో పని చేసిన వ్యక్తిగా సోమేష్ కుమార్ కు పేరుంది. సీఎం కేసీయార్ ఏ పథకం ప్రకటించినా ఆ పథకాల అమలులో సోమేష్ కుమార్ కీలక పాత్ర పోషించారు. 
 
మూడు సంవత్సరాల పాటు సీఎస్ గా ప్రభుత్వం సోమేష్ కుమార్ నే కొనసాగించనుంది. తెలంగాణ రాష్ట్రంలో ఐదవ సీఎస్ గా సోమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎం కేసీఆర్ కు సోమేష్ కుమార్ కు పూర్తి స్థాయిలో సమన్వయం కుదిరిందని సమాచారం. 2023 డిసెంబర్ 31వరకు సీఎస్ గా సోమేష్ కుమార్ కొనసాగనున్నారు. ఎస్కే జోషిని ఇరిగేషన్ శాఖ సలహాదారుడిగా నియమించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: