ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో జగన్  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చని ప్రకటన చేసిన రోజు నుండి ఏపీ ప్రజల్లో, రాజకీయ పార్టీల నేతల మధ్య రాజధాని గురించే చర్చ జరుగుతోంది. ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటన గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. వైసీపీ పార్టీ న్యాయం చేస్తుందని నమ్మి ఓట్లు వేస్తే వారికి ఇచ్చే కానుక ఇదేనా...? అని పవన్ ప్రశ్నించారు. 
 
అమరావతిని రాజధానిగా ఆమోదిస్తున్నామని గతంలో జగన్ చెప్పారని ఈరోజు మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారంటే ప్రజా ప్రతినిధులు సిగ్గు పడాలని రాజధాని కంటే ముందు రైతులను మోసం చేయడం బాధాకరం అని అన్నారు. అమరావతిపై జగన్ కు ఎందుకంత కక్ష అని పవన్ ప్రశ్నించారు.అమరావతిలో అవకతవకలు జరిగితే దోషులను శిక్షించాలని కొంతమంది నాయకులపై కోపంతో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం సమంజసం కాదని అన్నారు. 
 
సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన వలన ప్రజల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీ రాజధాని అమరావతిలో రాజధానిని మార్చవద్దంటూ ఆందోళనలు జరుగుతున్నాయని జరుగుతున్న అందోళనలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో అని భయంగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ నేతలు అమరావతి రాజధానిగా ఉండదని విశాఖ రాజధాని అని చెబితే అప్పుడు జనసేన కార్యాచరణ ప్రకటిస్తుందని అన్నారు. హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామని చెప్పి రాయలసీమ ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని పవన్ అన్నారు. 
 
చంద్రబాబు పాలనలో అదే అమరావతిలో ఎంతో మంది సామాన్య మధ్యతరగతి వర్గాల నుంచి బలవంతంగా భూసేకరణ చేశారు. అప్పుడు హడావుడిగా అమరావతి వెళ్లి వాళ్లకు అన్యాయం జరిగితే ఊరుకోం అని చెప్పిన పవన్ తర్వాత సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఇంకా రాజధాని పై జగన్ క్లారిటీ ఇవ్వకుండానే ప్రజలను రెచ్చగొట్టేలా తనకు భయం వేస్తోందని మాట్లాడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: