దేశంలో చిన్నారులు, యువతులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఇటువంటి దురాగతాలకు అంతేలేకుండా పోతోంది. ఇటువంటి దారుణాలు జరుగకుండా న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు, విధించే శిక్షలు మరో అమానవీయ ఘటనలు జరుగకుండా అడ్డుకునేందుకు దోహదపడుతున్నాయి. అటువంటి శిక్షే నెల్లూరు జిల్లాలో 7ఏళ్ల క్రితం ఓ యువతిపై దారుణానికి ఒడిగట్టిన కామాంధుడికి విధించింది. నెల్లూరు జిల్లా గూడూరు మండలం పూరి పాళెం గ్రామానికి చెందిన బండి ఆదెయ్యకు 10ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ. 20వేల జరిమానా విధిస్తూ 8వ అదనపు సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి బి. సత్యనారాయణ తీర్పు చెప్పారు.

 

 

తల్లిదండ్రులు లేక ఒంటరైన యువతి చిల్లకూరు మండలం కమ్మవారిపాళెంలో తన చిన్నాన్న వద్ద ఉంటోంది. 2012, నవంబర్ 29వ తేదీన అనారోగ్యంతో బాధపడుతూ చిన్నాన్నతో కలిసి ఆస్పత్రికి గూడూరుకు బైక్‌పై బయలుదేరింది. ఇద్దరూ కొద్ది దూరం వెళ్లాక ఆయన ఫోన్ మరిచిపోవడంతో యువతిని అక్కడే ఉండమని చెప్పి తిరిగి ఇంటికి వెళ్లాడు. దీంతో రోడ్డు పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న యువతిని  గమనించిన కమ్మవారిపాళెంకు చెందిన ఓదెయ్య ఆమెను ఒంటరిగా ఉండడం చూసి కన్నేశాడు. బేల్థారి పనికి  వెళ్తున్న ఆ వ్యక్తి యువతిని బెదిరించి పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. కాసేపటి తర్వాత అక్కడికి తిరిగొచ్చిన చిన్నాన్నకు యువతి విషయం చెప్పింది. వెంటనే ఆయన చిల్లకూరు పోలీసులకు ఈ దారుణంపై ఫిర్యాదు చేశాడు.

 

 

పోలీసులు ఆ యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అనంతరం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఏడేళ్ల పాటు కొనసాగిన ఈ విచారణలో ఆదెయ్య చేసిన నేరం రుజువు కావడంతో కోర్టు ఆ కామాంధుడిని దోషిగా నిర్ధారించి పదేళ్ల జైలు శిక్ష విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: