స్మార్ట్‌ఫోన్‌...ఇప్పుడు ప్ర‌పంచాన్ని కొత్త‌గా చూపిస్తున్నాయి. అద్భుత‌మైన క్లారిటీ క‌ల‌ కెమెరాలు, శక్తివంతమైన సెన్సార్లు, అధిక మెమరీ సామర్థ్యం, ర్యామ్, చార్జింగ్, టచ్ స్క్రీన్, దాని పరిమాణం, పిక్చర్, సౌండ్ నాణ్యతలు ఇలా చాలా రకాల్లో స్మార్ట్‌ఫోన్లు అభివృద్ధి చెందాయి. దీంతో..మ‌న దృక్కోణం మారిపోయింది. ఇన్ని సౌల‌భ్యాలు ఉండ‌టం వ‌ల్లే... 2019లో స్మార్ట్ ఫోన్ల కొనుగోలు ఓ రేంజ్‌కి చేరింది. 2019లో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 9 శాతం పెరిగినట్లు తేలింది. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ వ్యవధిలో దేశంలోకి 115 మిలియన్లకుపైగా స్మార్ట్‌ఫోన్లు దిగుమతి అయ్యాయి.

 


ఇక స్మార్ట్‌ఫోన్ల విష‌యంలో...షియామీ, సామ్‌సంగ్, వివో, ఒప్పో, రియల్‌మీ సంస్థలు టాప్-5లో నిలిచాయి. నిజానికి ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ల సగటు ధరలు పెరిగాయి. గ‌త సంవ‌త్స‌రం రూ.5 వేల నుంచి 10 వేలు పలికిన స్మార్ట్‌ఫోన్లు.. ఈ ఏడాది రూ.10 వేల నుంచి 15 వేలకు చేరాయి. అయినప్పటికీ అమ్మకాలు ఆగలేదు. చాలా మంది ఖరీదైన మొబైల్ కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. ఈ క్రమంలోనే ప్రీమియం శ్రేణి మొబైల్ ఫోన్లకు ఆదరణ పెరిగింది. రూ.14,000 నుంచి రూ.21,000-35,000 స్థాయి వరకు ధరలున్న స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయని, ప్రధానంగా షియామీ, ఒప్పో, వన్‌ప్లస్ మోడళ్లకు డిమాండ్ కనిపించిందని అంతర్జాతీయ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) గణాంకాలు చెబుతున్నాయి. మార్కెట్‌లో 80 శాతానికి వీటి వాటా చేరిందని ఐడీసీ ఈ సందర్భంగా పేర్కొన్నది. స్మార్ట్‌ఫోన్ వినియోగంలో అప్‌గ్రేడ్ అవుదామనుకునే వారి సంఖ్య క్రమేణా పెరుగుతున్నదని, డిజైన్, ఇతరత్రా సదుపాయాలను చూస్తున్నారని ఐడీసీ ఇండియా అసోసియేట్ రిసెర్చ్ మేనేజర్ (క్లయింట్ డివైజెస్) ఉపాసన జోషి అన్నారు.

 

 వచ్చే ఏడాది స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వృద్ధి రెండంకెల స్థాయికి చేరుకోవచ్చని 12-14 శాతంగా నమోదు కావచ్చని కౌంటర్‌పాయింట్ రిసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ తరున్ పాతక్ అంటున్నారు. దిగుమతులూ భారీగా పెరుగవచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలోనే 2022 నాటికి దేశంలోని 70 కోట్లకుపైగా జనాభా వద్ద స్మార్ట్‌ఫోన్లు ఉంటాయని అంచనా వేశారు. రాబోయే 4-5 ఏండ్లలో 100 కోట్లకుపైగా స్మార్ట్‌ఫోన్లు అమ్ముడవుతాయన్నారు. 5జీ రాకతో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు జెట్ స్పీడును అందుకోవచ్చన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: