అమరావతి రైతులు వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేస్తూ , అందరి దృష్టి ని ఆకర్షిస్తున్నారు . తమ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ అమరావతి రైతులు,  రాష్ట్రపతికి లేఖ రాయడం హాట్ టాఫిక్ గా మారింది . రైతులు , రాష్ట్రపతి లేఖలు రాస్తే ... మహిళలు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని   సేవ్ అమరావతి .. సేవ్ ఆంధ్ర ప్రదేశ్ అంటూ తమ లోగిళ్ళలో ముగ్గులు వేసి ప్రభుత్వ నిర్ణయం పట్ల నిరసన వ్యక్తం చేశారు . రైతు కంట, తల్లి  కంట  కన్నీరు మంచిది కాదని మహిళలు పాలకులకు హితువు పలికారు . అమరావతే తమ రాజధాని అని ప్రకటించారు .

 

 ఇక రాజధాని అంశం లో తాము దారుణంగా మోసపోయి , రోడ్డున పడ్డామని రైతులు  ఆందోళన వ్యక్తం చేశారు . తాము ఒక మంచి పనికోసం ముందుకు వచ్చి భూములిచ్చి త్యాగం చేస్తే , తమకు దక్కిన ఫలితమిదని ఆవేదన వ్యక్తం చేశారు . తమకు మరణమే శరణ్యమని ,  అనుమతి ఇవ్వాలని రాజధాని రైతులు రాష్ట్రపతిని  కోరారు . ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో ఉన్నపళంగా, తాము రోడ్డున పడ్డామని   రైతులు ఆవేదన వ్యక్తం చేశారు .  రాజధాని విషయంలో జగన్ మాట తప్పారంటూ మండిపడుతున్నారు .

 

 ఎటువంటి లాభాపేక్ష లేకుండా తాము భూములిస్తే , తమ త్యాగాలను అధికార పార్టీ నేతలు అవహేళన చేస్తున్నారని రైతులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు . ముఖ్యమంత్రి జగన్ , కొంతమంది  స్వలాభం కోసం రాజధానిని తరలించే కుట్ర చేస్తున్నారని అన్నారు . రాజధాని అమరావతి నుంచి తరలిపోతే , తాము జీవశ్చవాలు మాదిరిగా మిగిలిపోతామని అన్నారు .  మంగళగిరి కి చెందిన ఆర్వీ శ్రీనివాసరావు పేరిట విడుదలైన ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది .

మరింత సమాచారం తెలుసుకోండి: