కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ అమరావతి రైతులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాశారు. రాజధాని విషయంలో మోసపోయినందున చనిపోయే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆ లేఖలో ఏమని రాశారంటే..

 

ముఖ్యమంత్రి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో మేమంతా ఉన్నపళంగా రోడ్డున పడ్డాం. అధికారంలోకి వచ్చాక జగన్ మాట మార్చారు. కేవలం ముఖ్యమంత్రి , పలువురు వ్యక్తుల స్వలాభం కోసం రాజధానిని విశాఖకు తరలించే కుట్ర చేస్తున్నారు. రాజధాని మార్చవద్దంటూ మా కుటుంబాలతో కలిసి 14 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా మమ్మల్ని పట్టించుకున్నవారు లేరు. మా గోడు వినిపించుకున్న వారు లేరు. పైగా అధికార పార్టీ నేతలు మా త్యాగాన్ని హేళన చేస్తున్నారు.

 

కులం, మతం, ప్రాంతం అంటగడుతున్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నశాసన సభాపతి ,మంత్రులు ,ఎమ్మెల్యేలు రాజధాని స్మశానం అని ఒకరు, ఎడారి అని ఇంకొకరు ,ఆందోళన చేస్తున్న రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అని మరొకరు ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే మాపై దాడులకు దిగుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అర్ధరాత్రి మా ఇళ్లపైకి పోలీసులను పంపి మమ్మల్ని జైళ్లలో పెడుతున్నారు.
అక్రమంగా హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారు.

 

మా పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. అండగా నిలవాల్సిన ప్రభుత్వమే మాపై కక్ష కట్టింది. ఒక మంచి కార్యం కోసం మేం చేసిన త్యాగాలకు దక్కిన ఫలితమిది. రాజధాని తరలిపోతే మేము జీవచ్ఛవాలుగా మిగిలిపోతాం. ఈ బతుకులు మాకొద్దు. ఇక మాకు మరణమే శరణ్యం. దయ ఉంచి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి అంటూ లేఖలో పేర్కొన్నారు.

 

అయితే సాధారంగా కారుణ్య మరణాలు అంటే.. నయం కాని జబ్బులతో బాధపడుతున్నా.. వైద్యానికి డబ్బులేక ఇబ్బంది పడుతున్నా.. ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అమరావతి రైతులు మాత్రం ప్రభుత్వంపై నిరసనగా ఇలాంటి ప్రయత్నం చేశారు. మరి రాష్ట్రపతి ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: