తిరుపతి లడ్డూ అంటే ఎంత ఫేమస్సో చెప్పాల్సిన పని లేదు. తిరుపతి వెళ్లి వస్తే..ఇంటికి వచ్చాక చుట్టాలు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు తిరుపతి లడ్డూ పంచందే.. తృప్తి ఉండదు. ఒకవేళ లడ్డూ ప్రసాదం పెట్టకపోతే... తిరుపతి వెళ్లొచ్చారు.. కనీసం ప్రసాదం పెట్టరా అని అడిగి మరీ తీసుకుంటారు.

 

పెట్టిన కాస్త ప్రసాదమైనా కళ్లకు అద్దుకుని తామే తిరుపతి వెళ్లి వచ్చినంతగా భావిస్తారు భక్తులు. మరి అంతటి ప్రాశస్త్యం ఉన్న తిరుపతి లడ్డూ ఇప్పుడు భక్తులకు భారంగా మారుతుందన్న సంకేతాలు వస్తున్నాయి. తిరుమల శ్రీవారి లడ్డూపై ఇప్పటిదాకా ఇస్తున్న రాయితీని ఎత్తివేసేందుకు టీటీడీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం ఆలయంలోకి వచ్చే ప్రతి భక్తుడికీ ఉచితంగా లడ్డూ ప్రసాదం టోకెన్‌ అందిస్తుందట.

 

వైకుంఠ ఏకాదశి నుంచి ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.ప్రస్తుతం కాలినడకన వచ్చే భక్తులకు ఒక ఉచిత లడ్డూ ఇస్తున్నారు. దివ్యదర్శనం, టైంస్లాట్‌, సర్వదర్శనం ద్వారా వచ్చే భక్తులకు రెండు లడ్డూలు రూ.10, మరో రెండు రూ.25 ధరతో మొత్తంగా రూ.70కి నాలుగు లడ్డూలు ఇస్తోంది. రూ.300 టిక్కెట్‌పై ప్రత్యేక దర్శనం, వీఐపీ బ్రేక్‌దర్శనం, విశేష ఆర్జిత సేవలకు వచ్చి దర్శించుకునేవారికి రెండేసి లడ్డూలను ఉచితంగా ఇస్తున్నారు.

 

అయితే.. ఇకపై ఈ రాయితీలన్నింటినీ ఎత్తేస్తున్నారట. ప్రతి భక్తుడికీ ఒక లడ్డూ ఉచితంగా ఇచ్చి.. మిగిలినవి రూ.50 చొప్పున కొనుక్కునేలా విక్రయిస్తారట. ఇటీవలి టీటీడీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగిందట. సో.. ఒక లడ్డూను ఉచితంగా ఇస్తున్నా.. అదనపు ప్రసాదంపై రాయితీ తొలగించడంతో భక్తులు తయారీ ధరకు కొనుగోలు చేయాలి. ఒక అంచనా ప్రకారం ప్రస్తుత పద్దతిలో ఐదుగురు భక్తులున్న కుటుంబం రూ.350 చెల్లించి 20 లడ్డూలు తీసుకునే వీలుంది. ఇప్పుడు కొత్త పద్ధతి ప్రకారం రూ. 750 చెల్లించాల్సివస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: