అనేక ట్విస్టుల న‌డుమ‌... మహారాష్ట్రలో ప్ర‌భుత్వం కొలువుదీరిన సంగ‌తి తెలిసిందే. ఊహించ‌ని రీతిలో శివ‌సేన‌-కాంగ్రెస్‌-ఎన్సీపీ సంకీర్ణ స‌ర్కారు ఏర్ప‌డ‌గా... శివ‌సేన ర‌థ‌సార‌థి ఉద్ధవ్‌ థాకరే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. అయితే, తాజాగా ఉద్ద‌వ్ విష‌యంలో అనూహ్య ప‌రిణామం జ‌రిగింది. ఉద్ద‌వ్‌ను విమర్శించిన ఓ వ్యక్తిపై శివసేన పార్టీ మహిళా కార్యకర్త ఇంకు చల్లింది.

 

గత ఏడాది నవంబర్‌ 28న మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్‌ థాకరే ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అనంత‌రం ఓ సంద‌ర్భంలో సీఎం ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ... పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం విష‌యంలో ఆందోళ‌న‌ల‌కు వేదికైన‌ జామియా ఇస్లామియా యూనివర్సిటీ ఘటనను జలియన్‌ వాలాబాగ్‌తో పోల్చారు. దీనిపై ఓ వ్య‌క్తి స్పందిస్తూ...సీఎం ఉద్ద‌వ్ కామెంట్లు స‌రికాద‌ని అన్నారు. అయితే, అతడిని 25 నుంచి 30 మంది శివసేన కార్యకర్తలు చుట్టుముట్టి తీవ్రంగా కొట్టిన విషయం విదితమే. అంతటితో ఆగకుండా అతడికి బలవంతంగా శివసేన కార్యకర్తలు గుండు గీయించారు. ఈ క‌ల‌క‌లం సద్దుమ‌ణ‌గ‌క ముందే, తాజాగా మ‌ళ్లీ అదే త‌ర‌హా ఘ‌ట‌న‌కు శివ‌సేన కార్య‌క‌ర్త‌లు ఒడిగ‌ట్టారు. 

 


ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి ఉద్ధవ్‌ అనర్హుడు, విధ్వంసుడు అని ఆయనను విమర్శిస్తూ ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో తన వ్యాఖ్యలను పోస్టు చేశాడు. దీంతో శివసేన మహిళా కార్యకర్త తీవ్రంగా ఆగ్రహించింది. సదరు వ్యక్తిని గుర్తించి.. అందరూ చూస్తుండగానే ఆయనపై ఇంకు చల్లి నిరసన వ్యక్తం చేసింది మహిళా కార్యకర్త. ఈ ఘటన మహారాష్ట్రలోని బీద్‌ జిల్లాలో డిసెంబర్‌ 30న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ముఖ్య‌మంత్రిపై విమ‌ర్శ‌లు చేసినంత ఇలా దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తారా?  ప్ర‌జాస్వామ్య ప్ర‌భుత్వంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు ఏమిట‌ని మ‌హారాష్ట్రలో ప్ర‌తిప‌క్ష‌మైన బీజేపీ ప్ర‌శ్నించింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న కొద్దిరోజుల‌కే ఆ పార్టీకి చెందిన ప్ర‌జాస్వామ్య వ్య‌తిరేక ల‌క్ష‌ణాల‌ను శివ‌సేన ఒంట‌బ‌ట్టించుకుంద‌ని బీజేపీ ఆరోపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: