టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో తెలంగాణ రాష్ట్ర స‌మితికి ఓనర్లంటూ ఎవ‌రూ ఉండ‌ర‌ని..అంతా ఓన‌ర్ల‌మేన‌ని కామెంట్ చేసి క‌ల‌క‌లం రేకెత్తించిన ఈట‌ల తాజాగా మ‌ళ్లీ అదే త‌ర‌హా మాట‌లు మాట్లాడారు. ఈట‌ల రాజేంద‌ర్ కామెంట్లు టీఆర్ఎస్‌లో ప్ర‌కంప‌న‌లు పుట్టించి...తాజాగా స‌ద్దుమ‌ణుగుతున్న త‌రుణంలో... మ‌ళ్లీ అదే త‌ర‌హా విష‌యాలు స్పందించారు. 

 

టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా, క‌రీంనగర్ జమ్మికుంటలో జరిగిన స‌మావేశంలో ఈటల రాజేంద‌ర్ మాట్లాడుతూ.... `నమ్మిన వాళ్లే మోసం చేస్తే బాధనిపిస్తోంది. తిన్నింటి వాసాలు లెక్కపెట్టేవారి వల్ల మనసు గాయపడింది` అంటూ మ‌ళ్లీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నమ్మక ద్రోహం చేసే వారు బాగుపడరని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ధర్మంగా కొట్లాడడం మాత్రమే తెలుసని, దొంగ దెబ్బతీయడం చేతకాదని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. జమ్మికుంట, హుజురాబాద్ ప్రజల ఓట్లు అడగడానికి పూర్తి హక్కు తనకే ఉందని వ్యాఖ్యానించారు.  తమ లీడర్ ను గెలిపించుకోవడానికి అన్నీ ప్రయత్నాలు చేస్తారని కార్యకర్తలపై ప్రశంసల వర్షం కురిపించారు.

 

క్యాంపు రాజకీయాలు చేయడం తన వల్ల కాదని పేర్కొన్న  మంత్రి ఈటల రాజేంద‌ర్‌, అమ్ముడు పోనిది ఆత్మ గౌరవం మాత్రమే.  ప్రజలు ధర్మం తప్పరు. అలా తప్పి ఉంటే మొన్న నేను గెలిచే వాడినే కాదని చెప్పారు.  తాను కొట్లాడినట్లు ఎన్నికలు ఎవరు కొట్లాడలేద‌ని, తెలిపారు. గడిచిన 18 ఏళ్లలో చాలా అనుభవం వచ్చిందని చెప్పిన ఈటల‌ కష్టపడండి, నీతి నిజాయితీగా పని చేయండి…గుణగణాలు చూసి ప్రజలు ఓటు వేస్తారన్నారు. అయితే, గ‌తంలో చేసిన కామెంట్ల‌కు కొన‌సాగింపుగా మ‌ళ్లీ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారింది.  ఎన్నిక‌ల స‌మాయ‌త్తం కోసం పార్టీ శ్రేణుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో ఈ కామెంట్లు చేయ‌డం ఏంట‌ని టీఆర్ఎస్ వ‌ర్గాలు సైతం చ‌ర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: