మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చంద్రబాబునాయుడుపై జగన్మోహన్ రెడ్డి మరోసారి దారుణమైన దెబ్బ కొట్టినట్లేనా ? క్షేత్రస్ధాయిలో జరుగుతన్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరుగుతున్నాయి. మూడు రాజధానుల ప్రతిపాదనను జగన్ తెరపైకి తెచ్చి తెచ్చిన దగ్గర నుండి చంద్రబాబు పరిస్ధితి చాలా దారుణంగా తయారైంది.

 

మూడు రాజధానుల అంశాన్ని జగన్ అసెంబ్లీలో ప్రకటించగానే ముందు చంద్రబాబుకు మైండ్ బ్లాండ్ అయిపోయింది. తర్వాత కోలుకుని రెండు రోజులు జగన్ పై  తీవ్రంగా రెచ్చిపోయారు. తర్వాత పార్టీ నేతల అభిప్రాయాలు చూసిన తర్వాత మూడు రోజులు ఏమీ మాట్లాడలేదు. కానీ తర్వాత నుండి మళ్ళీ యాగీ మొదలుపెట్టారు. ఇపుడు అమరావతి ప్రాంతంలోని రైతులతో దగ్గరుండి మరీ ఆందోళన చేయిస్తున్నారు.

 

మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటూ చంద్రబాబు కూడా ఆందోళనలకారులతో కలిసి నినాదాలు చేస్తున్నారు. ఇక్కడే చంద్రబాబును జగన్ బాగా కార్నర్ చేసినట్లు అర్ధమైపోతోంది.  జగన్ ప్రకటించినట్లుగా విశాఖపట్నంలో రాజధాని, కర్నూలులో హై కోర్టును చంద్రబాబు పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు అందరికీ అర్ధమైపోయింది. దాంతో చంద్రబాబు నిర్ణయంపై  రాయలసీమ, ఉత్తరాంధ్రలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసింది.

 

తమ ప్రాంతాలను జగన్ అభివృద్ది చేస్తానని అంటుంటే చంద్రబాబు మాత్రం కేవలం కమ్మ సామాజికవర్గం అధికంగా ఉండే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే మొత్తం అభివృద్ది కేంద్రీకృతం కావాలని చూస్తున్నారంటూ మండిపోతున్నారు. మామూలు జనాలే కాదు చివరకు పార్టీ నేతలు కూడా  చంద్రబాబు వైఖరిని సమర్ధించలేకపోతున్నారు.

 

స్ధానికుల ఒత్తిడి, మనోభావాలను దృష్టిలో పెట్టుకుని రాయలసీమ, ఉత్తరాంధ్రలోని టిడిపి నేతలు కూడా జగన్ నిర్ణయానికి జై కొడుతున్నారు. అంటే మనకు అర్ధమవుతున్నదేమంటే చంద్రబాబు కేవలం రెండు జిల్లాలకు మాత్రమే పరిమితమైపోయినట్లు తెలిసిపోతోంది.  రాజధాని విషయంలో ఇటు జగన్ అటు చంద్రబాబు వాదనలో ఎవరిది కరెక్టో తెలియాలంటే రేపటి స్ధానిక ఎన్నికల వరకూ ఆగితే సరిపోతోంది.

 

ఇక్కడ  విచిత్రమేమిటంటే 23 జిల్లాల సమైక్య రాష్ట్రం విభజనకు మద్దతిచ్చి చంద్రబాబు చివరకు 13 జిల్లాలకు పరిమితమైపోయారు. తాజాగా రాజధాని తరలింపు విషయంలో జగన్ తో విభేదించి చివరకు 2 జిల్లాలకు మాత్రమే దిగజారిపోతారా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: