ఏపీ సీఎం జగన్ డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పారు. వైయస్సార్ సున్నా వడ్డీ పథకం కింద బ్యాంకు లింకేజీ ద్వారా డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లించటానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. మొదట మహిళల అకౌంట్లలో రూపాయి జమ చేయబోతున్న ప్రభుత్వం ఆ తరువాత పూర్తి వడ్డీని మహిళల బ్యాంకు ఖాతాలలో జమ చేయనుంది. నాలుగు విడతలలో లక్ష రూపాయల లోపు తీసుకున్న మహిళలకు ప్రభుత్వం రుణమాఫీ చేయనుంది. 
 
రుణమాఫీ డబ్బులు జమ అయ్యేలోగా ఆరునెలలకు ఒకసారి చొప్పున వడ్డీ చెల్లించటానికి ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం జగన్ ఎన్నికలకు ముందు నవరత్నాల్లో భాగంగా వైయస్సార్ ఆసరా పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయనున్నట్టు సీఎం జగన్ ప్రకటన చేశారు. 2019 సంవత్సరం ఏప్రిల్ నెల 11వ తేదీకి ముందు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
నాలుగు విడతలలో మొత్తం 840 కోట్ల రూపాయల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. డ్వాక్రా రుణాలను పొందిన మహిళలు వారు తీసుకున్న రుణాలను చెల్లిస్తూనే ఉండాలి. ప్రభుత్వం నుండి మాఫీ అయిన నగదు నేరుగా రానున్న రోజుల్లో లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానుంది. పట్టణాల్లో, మండలాల్లో, గ్రామాలలో లబ్ధిదారులను సంబంధిత అధికారులు ముందుగానే గుర్తిస్తారు. 
 
అర్హులైన లబ్ధిదారుల వివరాలను ఏపీఎం లాగిన్ ద్వారా సెర్ఫ్ కు సమాచారం అందిస్తారు. ఏప్రిల్ 11 2019లోపు రుణాలు తీసుకున్న మహిళలకు బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం ఆ మొత్తాన్ని జమ చేయనుంది. అర్హులైన లబ్ధిదారులందరికీ నాలుగు విడతలలో రుణాలు మాఫీ అవుతాయి. వడ్డీ చెల్లించటానికి ఏపీ ప్రభుత్వం సిద్ధం కావడం పట్ల డ్వాక్రా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలో సీఎం జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: