కేసీఆర్ .. తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ నాయకుడు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపనవాడు.. ఇద్దరు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా చేసినవాడు.. అయితే అంతటి అనుభవం ఉన్న కేసీఆర్.. సంకల్పబలం ఉన్న జగన్ ముందు బలాదూర్ అయ్యారా.. ఏపీస్ ఆర్టీసీ విషయం చూస్తే అవుననే అనిపిస్తుంది. ఇటీవలే తెలంగాణలో విలీనం చేయాలంటూ సమ్మె జరిగితే.. ఈ భూమి మీద ఇది జరగని పని అంటూ కేసీఆర్ తేల్చేశారు.

 

కానీ అదే పనిని ఇప్పుడు జగన్ చేసి చూపించారు. సంకల్ప బలం ఉంటే సాధ్యమని నిరూపించారు. ఇదే మాట అంటున్నారు ఏపీ మంత్రి పేర్ని నాని. ఈ సందర్భంగా పేర్ని నాని పాత విషయాలు గుర్తు చేసుకున్నారు.

 

ఆయన ఏమన్నారంటే.. “ 2017లో చంద్రబాబును కార్మిక సంఘం నాయకులు వార్షికోత్సవ సభలో ఆర్టీసీ విలీనం గురించి ప్రస్తావిస్తే ..విలీనం వంటి పిచ్చిపిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు..ఆర్టీసీ నాశనం అవుతుందని చెప్పిన అనుభవజ్ఞుడు చంద్రబాబు. వైయస్‌ జగన్‌కు అలాంటి అనుభవం లేదు. ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు. అయినా సరే ఆర్టీసీని విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులు పాదయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిశారు. ఆర్టీసీని విలీనం చేస్తేనే మాకు భద్రత ఉంటుందని చెబితే..మారు మాట్లాడకుండా, ఎవరితో ఆలోచించకుండా వెనువెంటనే వైయస్‌ జగన్‌ ఓ మాట అన్నారు.

 

దేవుడి దయ వల్ల, మీ అందరి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం వస్తే..ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. ఎన్నికలు పూర్తి అయిన వెంటనే ఎలాంటి కమిటీలు వేయకుండా ఆర్టీసీని విలీనం చేయబోతున్నానని ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే వైయస్‌ జగన్‌ తన నిర్ణయాన్ని ఐఏఎస్‌ అధికారులకు చెప్పారు. నాతో పాటు అందరూ వైయస్‌ జగన్‌ తొందర పడుతున్నారని అనుమానం ఉండేది. ఎలా విలీనం చేస్తారని అందరూ భావించారు. 53 వేల మంది జీతభత్యాలు రూ.4 వేల కోట్లు సంవత్సరానికి భరించే స్థోమత ప్రభుత్వానికి ఉందా? చంద్రబాబు పసుపు కుంకుమకు ఉన్న డబ్బులన్నీ కాజేశారు. ఇది సముచితమైన నిర్ణయం కాదేమో అనుకున్నాం. కానీ జగన్ చేసి చూపించారని కితాబిచ్చారు పేర్ని నాని.

మరింత సమాచారం తెలుసుకోండి: