టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనేసేన అధినేత పవన్ కల్యాణ్ ల మైత్రీ బంధం కొనసాగుతోందనే విమర్శలకు పలు సన్నివేశాలు, పరిస్థితులు ఊతమిస్తున్నాయి. అమరావతి ప్రాంతంలో రాజధానికి భూములిచ్చిన రైతులకు అండగా చంద్రబాబు నిలుస్తున్నారు. పవన్ కల్యాణ్ కూడా ఇదే తరహాలో రైతులకు భరోసాగా నిలుస్తున్నారు. పవన్ కల్యాణ్ మొన్న రాజధాని గ్రామాల్లో చేపట్టిన ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కంచెలు దాటుకుంటూ, నేలపై పడుకుని రైతులకు అండగా నిలుస్తున్నారు.

 

 

పనిలో పనిగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంతవరకూ ఓ రాజకీయ పార్టీ అధినేతగా ఆయన తనవంతు పాత్ర పోషిస్తున్నారు. తన పోరాటంలో భాగంగా జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం సానుభూతి వ్యక్తం చేస్తున్నట్టుగా ఉందనేది కొందరి మాట. ‘చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతంగా అమరావతిని బాగానే అభివృద్ధి చేశారు. కానీ ఆ అభివృద్ధిని ప్రజలకు చూపించుకోలేక పోయారు. దీంతో రాజధాని గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’ అని అంటున్నారు. ఇది చంద్రబాబును విమర్శించడమా.. లేక టీడీపీ ఓడిపోయిందనే సానుభూతా అనేది అర్ధం కాని ప్రశ్న. 2014లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన నాటి నుంచి ఇప్పటికి ఆయనతో పాటే నడుస్తున్నారనేది రాజకీయ వర్గాల మాట.

 

 

పవన్ వ్యాఖ్యలు పరిశీలిస్తే ఇదే అర్ధమవుతుంది కూడా. 2018లో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో టీడీపీపై, చంద్రబాబు, లోకేశ్ లపై విమర్శలు చేసినా ప్రజలు కానీ, రాజకీయ వర్గాలు కానీ నమ్మే పరిస్థితి లేకపోయింది. ఎన్నికల సమయంలో కూడా వీరి నియోజకవర్గాల్లో వీరిద్దరూ ఒకరికొకరు వ్యతిరేకంగా మంగళగిరి, గాజువాక ప్రాంతాల్లో సభలు నిర్వహించకపోవటం ఇందుకు ఉదాహరణగా కనబడుతున్నాయి కూడా. మొత్తానికి చంద్రబాబు, పవన్ మైత్రిపై వచ్చే విమర్శలకు వారే సమాధానం చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: