జేడీయూ జాతీయ అధ్య‌క్షుడు,  బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్ ఆస‌క్తిక‌ర రీతిలో వార్త‌ల్లో నిలిచారు. మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాక నితీశ్‌ తన ప్రభుత్వ పనితీరుపై వార్షిక నివేదికను వెల్లడించే సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. తనతోపాటు తన మంత్రివర్గ సభ్యుల ఆస్తుల వివరాలను కూడా ఏటా ఆయన విడుదల చేస్తున్నారు. 2010 నుంచి ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ప్రజల పరిశీలనకు వాటిని అందుబాటులో ఉంచుతున్నారు. మంగళవారం గత ఏడాది ఆస్తుల నివేదికను పొందుపరుచగా.. సీఎంకన్నా మంత్రివర్గ సహచరుల్లో చాలామంది ఆర్థికంగా ఉన్నతస్థితిలోనే ఉన్నారని తేలింది.గోశాలలోని ఆవుల సంఖ్య పెరుగడం మినహా బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌కు ఉన్న ఆస్తుల్లో ఏమాత్రం ప్రగతి కనిపించలేదు.

 


గత ఏడాది నితీశ్‌ సొంత గోశాలలో 8 ఆవులు, ఆరు దూడలు ఉండేవి. ఈ ఏడాది వాటిసంఖ్య 10 ఆవులు, ఏడు దూడలకు పెరిగాయి. గత ఏడాది ఆయన వద్ద రూ.42,000 నగదు ఉండగా, అదికాస్తా ఈ ఏడాది రూ.38,039కి తగ్గిపోయింది. నితీశ్‌కు ఉన్న ఆస్తుల్లో గోశాలలోనే వృద్ధి కనిపించింది. ఢిల్లీలోని ఫ్లాట్‌ సహా రూ.40 లక్షలు విలువ చేసే స్థిర, రూ.16 లక్షలు విలువచేసే చరాస్తులు మాత్రమే అతనికి ఉన్న ఇతర ఆస్తులు. నితీశ్‌ కుమారుడికి.. తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పనిచేసి మరణించగా, వారసత్వంగా సంక్రమించిన రూ.1.39 కోట్ల చరాస్తి, రూ.1.48 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని తేలింది.

 

కాగా,  బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ మరోసారి యునైటెడ్‌ జనతాదళ్‌ (జేడీయూ) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు మ‌ళ్లీ ఈ సీటు ద‌క్కింది. పార్టీ జాతీయ ఎన్నికల అధికారి అనీల్‌ హెగ్డే మాట్లాడుతూ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి నితీశ్‌కుమార్‌ ఒక్కరే నామినేషన్‌ వేశారని చెప్పారు. పార్టీలోని వివిధ గ్రూప్‌లు పార్టీ అధ్యక్షుడిగా నితీశ్‌ కుమార్‌ అభ్యర్థిత్వానికి మద్దతుగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేశాయని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: