రాజధానిగా అమరావతిని  తరలించకూడదని ఆందోళనలు చేస్తున్న మహిళలను చూసి చలించిపోయి తాను కూడా ఉద్యమానికి మద్దతుగా వచ్చినట్లు చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రకటించటం అందరికీ తెలిసిందే. భువనేశ్వరి చేసిన ప్రకటనకు నెటిజన్ల నుండి  బ్రహ్మాండమైన  రివర్స్ పంచులు  పడుతున్నాయి.  నెటిజన్ల ఆరోపణలు, విమర్శలతో చంద్రబాబుకు కొత్త తలనొప్పులు మొదలైనట్లే.

 

ఇంతకీ విషయం ఏమిటంటే అమరావతి గ్రామాల్లో జరుగుతున్నదంతా పెయిడ్ ఆందోళనలే అనే ఆరోపణలున్నాయి. దానికి తగ్గట్లుగా భువనేశ్వరి ఆందోళనలో పాలుపంచుకోవటమే కాకుండా ఉద్యమ విరాళంగా తన చేతి గాజులు ఇచ్చారు. అలాగే చంద్రబాబు కూడా బహిరంగంగానే విరాళాలను సేకరిస్తున్నారు. దాంతో జరుగుతున్నదంతా  నిజంగానే పెయిడ్ ఆందోళనలే అనే ఆరోపణలు మరింత పెరిగిపోయాయి.

 

సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే మహిళల బాధకు చలించిపోయి  తాను కూడా దీక్షలో కూర్చున్నట్లు చెప్పారు. రాజధానికి భూములివ్వటం తమకు ఇష్టం లేకపోయినా చంద్రబాబు బలంతంగా భూములు లాక్కుంటున్నట్లు అప్పట్లో చాలామంది మహిళలు రోడ్లెక్కారు. మరి అప్పుడు వారి బాధలు భువనేశ్వరికి పట్టలేదా ?  విజయనగరం జిల్లాలో భోగాపురం విమానాశ్రయం కోసం గిరిజనుల భూములను చంద్రబాబు సర్కారు బలవంతంగా లాక్కుంది.

 

అప్పుడు కూడా చాలామంది మహిళలు రోడ్లపైకి వస్తే పోలీసులు చచ్చేట్లు కొట్టారు. మరపుడు ఆడవాళ్ళపై లాఠీఛార్జీలు భువనేశ్వరి దృష్టికి రాలేదా ? పోనీ విజయవాడకు కూతవేటు దూరంలోనే మహిళా ఎంఆర్వో వనజాక్షిని అప్పటి  టిడిపి ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ జుట్టుపట్టుకుని ఈడ్చి కొడితే భువనేశ్వరికి బాధనిపించలేదా ? అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

 

సరే ఈ విషయాలను పక్కన పెట్టేసినా నారాయణ కార్పొరేట్ విద్యాసంస్ధల్లో ఎందరో విద్యార్ధినులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరపుడు ఎందుకు భువనేశ్వరి స్సందించలేదు ? పోనీ విజయవాడలో సంచలనం సృష్టించిన కాల్ మనీ సెక్స్ రాకెట్ లో వందలాది బాధిత మహిళల ఆక్రందనలు భువనేశ్వరి చెవిలో పడలేదా ?  ఇవేవీ పట్టని నారావారి సతీమణికి ఇపుడే మహిళల ఆందోళనలు కనిపించటం విచిత్రంగా ఉందంటూ నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. మొత్తం మీద భువనేశ్వరి పర్యటన మేలు కన్నా కీడే ఎక్కువ చేసిందేమో ?

మరింత సమాచారం తెలుసుకోండి: