త‌న దూకుడుతో ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ మ‌ళ్లీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. దాదాపు ఆర్నేళ్లుగా సైలెంట్ అయి శాంతి మంత్రం జ‌పిస్తున్న కిమ్ ఇప్పుడు ప్ర‌పంచం మొత్తం వ‌ణికిపోయే కామెంట్ చేశారు.  ఉత్తర కొరియా వద్ద ప్రస్తుతం 50 అణ్వాయుధాలు ఉన్నట్టు అంచనా. శత్రు క్షిపణులను నిర్వీర్యం చేయగలిగే రక్షణ వ్యవస్థలు కూడా ఉన్నాయి. అమెరికాను చేరుకోగలిగే ఖండాంతర క్షిపణిని తయారు చేస్తున్నారు. ఇలాంటి తిక్క ప‌న‌నుల‌తోనే కిమ్‌కు భ‌య‌ప‌డే ప‌రిస్థితి ఉండ‌గా...తాజాగా ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు త్వరలో వ్యూహాత్మక ఆయుధాన్ని పరిచయం చేసి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తామని వెల్ల‌డించాడు.

 

వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ కొరియా కేంద్ర కమిటీ సమావేశం ఇటీవల జరిగింది. ఇందులో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ ప్రసంగిస్తూ సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేసినట్టు ఆ దేశ అధికార మీడియా ‘కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ’ తెలిపింది. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక చర్చలను అమెరికా ఏకపక్షంగా నిలిపివేయడంపై మండిపడ్డారు. అణ్వాయుధాల తయారీ, ఖండాంతర క్షిపణుల పరీక్షలపై ఇన్నాళ్లూ తాము స్వీయనియంత్రణ పాటించామని, ఇకపై అలా ఉండదని చెప్పారు. తాత్కాలికమైన ఆర్థిక ప్రయోజనాలకు తలొగ్గి దేశ భద్రతను తాకట్టు పెట్టబోమని కిమ్‌ పేర్కొన్నారు. ఉత్తరకొరియాపై అమెరికా ఒత్తిడి కొనసాగుతున్నంత కాలం అణు నిరాయుధీకరణ జరిగే ప్రసక్తే లేదని, ఐక్యరాజ్యసమితి తన ఆంక్షలను ఉపసంహరించుకునేవరకు దేశ భద్రత కోసం వ్యూహాత్మక ఆయుధాల తయారీ కొనసాగిస్తామని స్పష్టంచేశారు.

తమ దేశంపై కుట్రలు, అణుదాడి హెచ్చరికలు పెరిగిపోతున్నాయని, ఈ నేపథ్యంలో వ్యూహాత్మక ఆయుధాన్ని రూపొందిస్తున్నట్టు చెప్పారు. తమ దేశ ప్రజలు ఇన్నాళ్లూ అనుభవించిన బాధలకు సమాధానంగా, ఇన్నాళ్లూ నిలిచిపోయిన అభివృద్ధిని కొనసాగించేలా అనూహ్య చర్యలకు దిగుతామని హెచ్చరించారు. సాధారణంగా అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే వ్యవస్థలను వ్యూహాత్మక ఆయుధాలుగా పిలుస్తుంటారు. అయితే క్షిపణి పరీక్షలను పునరుద్ధరిస్తామని స్పష్టంగా ప్రకటించకుండా, దౌత్యపరమైన చర్చలకు తలుపులు తెరిచే ఉంచారు. అయితే, కిమ్ ఏమైనా చేయ‌గ‌ల స‌మ‌ర్థుడ‌ని..చ‌ర్చ‌లు అలా వ‌దిలేసి....అణు యుద్ధానికి దిగుతాడ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: