ఈ మధ్య కాలంలో యువత మద్యం, డ్రగ్స్ కు బానిసలై కొన్ని చోట్ల రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుండగా మరికొన్ని చోట్ల విధుల్లో ఉన్న ఉద్యోగులతో గొడవకు దిగుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా విధులు నిర్వహిస్తున్న ఎస్సైను మద్యం మత్తులో ఉన్న తాగుబోతులు కారుతో ఢీ కొట్టి ఎస్సై కాలు విరగటానికి కారణమయ్యారు. 
 
పూర్తి వివరాలలోకి వెళితే వికారాబాద్ లోని అనంతగిరిలో ఒక కారు భీభత్సం సృష్టించింది. పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో ఒక కారు పోలీసులపైకి దూసుకెళ్లింది. నవాబుపేట ఎస్సై కృష్ణకు ఈ ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో కొంతమంది పోలీసులకు కూడా గాయాలు అయ్యాయి. పోలీసులు కారులో ఉన్నవారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. 
 
పోలీసులు కారులో ఉన్న వ్యక్తులు మద్యం తాగి కారు నడిపినట్లు గుర్తించారు. గాయాలపాలైన ఎస్సై, పోలీసులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి వైద్యులు ఎస్సై కృష్ణకు కాలు విరిగినట్లుగా గుర్తించారు. డీజీపీ మహేందర్ రెడ్డి ఈ ఘటన గురించి ఆరా తీశారు. పోలీస్ సిబ్బంది కారు ఆపండి చెక్ చేయాలని కోరగా మమ్మల్నే తనిఖీలు చేస్తారా...? అంటూ ఆగ్రహంతో కారుతో ఢీ కొట్టారని సమాచారం. 
 
ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో ఎస్సై కృష్ణ చికిత్స పొందుతున్నారు. వికారాబాద్ డీఎస్పీ సంజీవరావు నిందితులు నిషేధిత మత్తు పదార్థాలను వాడినట్లు గుర్తించామని తెలిపారు. పోలీసులు నిందితులు టోలిచౌకికి చెందిన వారిగా గుర్తించారు. నిందితుల పేర్లు ఇమ్రాన్, అన్వర్, నవీద్, సమీర్ అని తెలుస్తోంది. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు నలుగురు నిందితులు డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించారు. మద్యం మరియు డ్రగ్స్ మత్తులో రెచ్చిపోయిన తాగుబోతులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎస్సై కృష్ణకు ప్రాణాపాయం ఐతే లేదని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: