రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ వల్ల లాభపడిన తెలుగుదేశంపార్టీ నేతల జాతకాలను బయటపెట్టటానికి వైసిపి రెడీ అవుతోంది.  సాయంత్రం పార్టీ కార్యాలయంలో 5 గంటలకు వీడియో ప్రజంటేషన్ ద్వారా నేతల వివరాలను, వాళ్ళ బినామీల వివరాలను జనాల ముందుంచటానికి వైసిపి ఏర్పాట్లు చేసుకుంటోంది. అమరావతిని రాజధానిగా చంద్రబాబునాయుడు ప్రకటించిన దగ్గర నుండి రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఒకటే గోల జరుగుతున్న విషయం తెలిసిందే.

 

జగన్ ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదన తర్వాత ఇన్ సైడర్ ట్రేడింగ్ పై చర్చ ఒక్కసారిగా ఊపందుకుంది. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి ఇదే విషమమై పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చారు. బుగ్గన చెప్పిన వివరాల ప్రకారం  చంద్రబాబు మద్దతుదారులు, కమ్మ సామాజికవర్గంలోని ప్రముఖులు, టిడిపి కీలక నేతలు సుమారు 4075 ఎకరాలను రాజధాని ప్రకటనకు ముందే సొంతం చేసుకున్నట్లు ఆరోపించారు.

 

చంద్రబాబు, యనమల రామకృష్ణుడు వియ్యంకుడు సుధాకర్ యాదవ్, లింగమనేని రమేష్, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్, పయ్యావుల కేశవ్, మాజీ మంత్రులు  ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, పల్లె రఘునాధరెడ్గి, పరిటాల సునీత, రావెల కిషోర్ బాబు, మాజీ ఎంఎల్ఏలు దూళిపాళ్ళ నరేంద్ర లాంటి అనేకమంది ఇక్కడ భారీ ఎత్తున వందల కోట్ల రూపాయలు లబ్ది పొందారని వైసిపి మొదటి నుండి ఆరోపిస్తోంది.

 

సరే వైసిపి ఆరోపణలను సహజంగా చంద్రబాబు, టిడిపి నేతలు ఖండించటం మామూలే అనుకోండి. పైగా ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటేనే తనకు ఏమిటో కూడా తెలియదని చంద్రబాబు చెప్పటమే హైలైట్.  అదే సమయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ లో  టిడిపి నేతలు దక్కించుకున్న భూములపై కోర్టు విచారణ చేయించమని కూడా చంద్రబాబు అండ్ కో డిమాండ్ చేస్తున్నారు. సరే వీళ్ళ డిమాండ్ ఎలాగున్నా సాయంత్రం ఇదే విషయమై ఎటువంటి వివరాలు ఇవ్వబోతోందనే అంశంపై ఆసక్తి పెరిగిపోతోంది. చూద్దాం సాయంత్రం ఏం  వివరాలు చెబుతారో.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: