గత నెల అనగా డిసెంబర్ 25వ తారీకు నుంచి కనిపించకుండా పోయిన ఇద్దరి తెలుగు వైద్యుల ఆచూకీని ఎట్టకేలకి పట్టుకున్నారు ఢిల్లీ పోలీసులు. తప్పిపోయిన ఇద్దరు ఎవరంటే.. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన డాక్టర్‌ హిమబిందు, అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన డాక్టర్‌ దిలీప్‌ సత్య. డాక్టర్ హిమబిందు డాక్టర్ శ్రీధర్ ని పెళ్లి చేసుకుంది. ఈ ముగ్గురు తమ ఎంబిబిఎస్ ఒకే కాలేజీలో ఒకే క్లాస్ లో చదవడంతో మంచి స్నేహితులయ్యారు. వాస్తవానికి శ్రీధర్, హిమబిందు లవ్ మ్యారేజ్ కు వాళ్ళిద్దరి స్నేహితుడైన దిలీప్ సత్య ఎంతో సహాయం చేసాడు.


అయితే గత నెల 25న ఢిల్లీలో ఉంటున్న హిమబిందు, శ్రీధర్ దంపతుల వాళ్ళ ఇంటికి చండీగర్ లో ఉంటున్న డాక్టర్ దిలీప్ సత్య వచ్చాడు. అయితే ఆ సమయంలో భర్త శ్రీధర్ ఎయిమ్స్ పిల్లల వైద్యశాలలో తన విధులను నిర్వహించడానికి వెళ్ళాడు. ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలైన హిమబిందు క్రిస్మస్ సెలవులు కావడంతో ఇంట్లోనే ఉంది. 11గంటల సమయంలో భర్త శ్రీధర్ కు ఫోన్ చేసి చర్చికి దిలీప్ తో పాటు వెళ్తున్నానని, చర్చికి వెళ్లిన తరువాత దిలీప్ రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోతాడని చెప్పింది. ఆ తర్వాత శ్రీధర్ డ్యూటీ దిగి మధ్యాహ్నం 2గంటల సమయంలో ఫోన్ చేసినప్పుడు ఆమె ఫోన్ స్విచాఫ్ అని వచ్చింది. అదేవిధంగా దిలీప్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. దాంతో కంగారు పడిపోయిన భర్త శ్రీధర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


శ్రీధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు మొదటగా సీసీ కెమెరాలను పరిశీలించగా వారికి దిలీప్, హిమబిందు కలసి నడుచుకుంటూ వెళ్ళిన దృశ్యాలు తప్ప మరేతర ఆధారాలు దొరకలేదు. దాంతో, వారి సోషల్ మీడియా తో పాటు బ్యాంక్ ట్రాన్సాక్షన్ పై నిఘా పెట్టారు ఢిల్లీ పోలీసులు. ఈ క్రమంలోనే వారు సిక్కింలో ఉన్నట్లు గుర్తించి బుధవారంనాడు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చెప్పిన ప్రాథమిక విచారణ ప్రకారం... భర్తతో విసుగు చెందిన డాక్టర్ హిమబిందు స్నేహితుడైన డాక్టర్ దిలీప్ సత్యతో వెళ్లినట్టు తెలిసింది. ఇద్దరిని ఢిల్లీలో విచారించి ఆ తర్వాత వారి సొంత గ్రామాలకు పంపించనున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: