చంద్రబాబునాయుడుపై ఓ ఎంఎల్ఏల తిరుగుబాటు జెండా ఎగరేశారు. అంత ధైర్యంగా తిరుగుబాటు జెండా ఎగరేసిన ఎంఎల్ఏ ఎవరనుకుంటున్నారా ? ఆయనే మద్దాలి గిరిధర్. అవును ఈరోజో రేపో టిడిపికి దూరంగా జరగాలని డిసైడ్ అయిన మద్దాలి గిరి మొన్ననే జగన్మోహన్ రెడ్డిని కలిసిన విషయం అందరూ చూసిందే.  దాంతో ఎక్కువ రోజులు గిరి టిడిపిలో కంటిన్యు అయ్యే అవకాశాలు లేవని అందరికీ అర్ధమైపోయింది. దానికి తగ్గట్లే గిరి కూడా మరో ఎంఎల్ఏ వల్లభనేని వంశీ బాటలోనే నడిచారు.

 

ఇంతకీ మద్దాలి ఏమన్నారంటే చంద్రబాబు కేవలం ఓ సామాజికవర్గానికి మాత్రమే కొమ్ము కాస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే గిరి ఇపుడు బహిరంగంగా చెప్పిందే పార్టీలో చాలామంది చర్చించుకుంటున్నారు. కాకపోతే పార్టీ నుండి బయటకు వచ్చేయాలని డిసైడ్ అయ్యారు కాబట్టే మద్దలి బహిరంగంగా చెప్పారంతే. పైగా ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచిచనట్లే ఇపుడు పార్టీకి కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నట్లు ఆరోపించారు.

 

 తన నియోజకవర్గం అభివృద్ది గురించి మాత్రమే తాను జగన్ ను కలిస్తే దానికి కూడా పార్టీలో తనను తప్పు పట్టటమేంటి ? అంటూ మండిపడ్డారు. తాను జగన్ ను కలిసిన మరుసటి రోజే తన అనుమతి లేకుండా పార్టీ ఇన్చార్జిని నియమించినట్లు చెప్పారు. అలాగే నాలుగు రోజులుగా పార్టీలో తనకు వ్యతిరేకంగా చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు మద్దాలి ఆందోళన వ్యక్తం చేస్తు చంద్రబాబుకు బహిరంగ లేఖ రాయటమే గమనార్హం.

 

జగన్ ను కలిసినందుకే తన నియోజకవర్గంలో  మరో నేతను ఇన్చార్జిగా నియమించిన చంద్రబాబు మరి వల్లభనేని వంశీ నియోజకవర్గంలో, కోడెల శివప్రసాద్ నియోజకవర్గంలో మాత్రం కొత్తగా ఎవరిని ఎందుకు ఇన్చార్జిగా ఎందుకు నియమించలేదని నిలదీశారు. జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో 9 సీట్లు ఒక సామాజికవర్గానికి చెందిన నేతలకే టికెట్లు కేటాయించటాన్ని గిరి తప్పు పట్టారు. సరే కారణాలు  ఏవైనా గిరి కూడా ఒకటి రెండు రోజుల్లో బయటకు వచ్చేయటం ఖాయమని తేలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: