మాజీ మంత్రి వైఎస్ వివేకానందా రెడ్డి  హత్య కేసు , టీడీపీ ఎమ్మెల్సీ బిటెక్ రవి మెడకు బిగుసుకుని అవకాశాలు కనిపిస్తున్నాయి . వివేకానందా రెడ్డి హత్య జరిగిన రోజు , ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తోన్న పరమేశ్వర్ రెడ్డి, బిటెక్ రవిని కలిసినట్లు గా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ )  పోలీసులు  అనుమానిస్తున్నారు . కడప హరిత హోటల్ బస చేసిన బిటెక్ రవిని , పరమేశ్వర్ రెడ్డి హత్య జరిగిన రోజే ఎందుకు కలిశాడన్న  కోణం లో దర్యాప్తు చేస్తున్నారు .

 

అదే సమయం లో ఆరోజు   హోటల్ సిసి ఫుటేజ్ ను సిబ్బంది నుంచి స్వాధీనం చేసుకోవడమే కాకుండా , మేనేజర్ ను కూడా ఇదే  విషయమై సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది . వివేకా హత్య కేసు నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ,   గత ఏడాది డిసెంబర్ లో బిటెక్ రవి ...  ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు . ఈ కేసులో ఇప్పటికే రవిని సిట్ పోలీసులు విచారించిన విషయం తెల్సిందే . రవిని సిట్ పోలీసులు విచారించిన అనంతరమే అయన హైకోర్టును ఆశ్రయించి , ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరడడం విశేషం .

 

గత ఏడాది మార్చి 15 వ తేదీ రాత్రి ఇంట్లో నిద్రిస్తోన్న   మాజీ మంత్రి వివేకానందరెడ్డి ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు . ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది . ఆయన్ని రాజకీయ ప్రత్యర్థులే హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు . ఎన్నికల సమయం కావడంతో , వివేకా ను నిజంగానే రాజకీయ ప్రత్యర్థులే హత్య చేసి ఉంటారన్న అనుమానాలు బలపడ్డాయి . వివేకా హత్య కేసును విచారించేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: