మూడు పంటలు పండే అమరావతి ప్రాంతం మళ్ళీ పచ్చదనం తో కళకళలాడనుందా ?, ఈ ప్రాంతంలో వ్యవసాయమే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందా??, అందుకే అమరావతి ప్రాంతాన్ని ప్రత్యేక అగ్రికల్చర్ జోన్ గా ప్రకటించాలని ప్రణాళికలు రచిస్తోందా?? అంటే అవుననే ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి .  అమరావతి ప్రాంత రైతుల నుంచి గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం 33  వేల ఎకరాల భూమిని సమీకరించింది . ఈ భూమిలో చాల ప్రాంతం ఇప్పటికి ఖాళీగానే ఉండగా , కొంత ప్రాంతంలో భవనాలు నిర్మించడం , విద్యాసంస్థలకు , ఇతర సంస్థలకు గత ప్రభుత్వ హయాం లో  కేటాయించారు .

 

రైతుల నుంచి సమీకరించిన  భూములతో పాటు, ప్రభుత్వ భూములను కలుపుకుని  ప్రత్యేక అగ్రికల్చర్ జోన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది . ప్రత్యేక అగ్రికల్చర్ జోన్ వల్ల రైతులకు కలిగే లాభాలు ఏమిటన్నదానిపై ఆయన త్వరలోనే  అమరావతి ప్రాంత రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది . రాష్ట్రం లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ ప్రతిపాదించిన తరువాత అమరావతిని  శాసన రాజధానిగా కొనసాగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది .

 

దీనితో రైతుల నుంచి సేకరించిన 33  వేల ఎకరాల భూముల్లో అసెంబ్లీ , హైకోర్టు , సచివాలయం , ఇతర భవనాల  నిర్మాణాలకుపోను , పలు సంస్థలకు కేటాయించిన భూములు కూడా తీసివేయంగా , మిగిలిన భూముల్లో ప్రత్యేక అగ్రికల్చర్ జోన్ ఏర్పాటు చేయడం ద్వారా తిరిగి అమరావతి ప్రాంతం లో మూడు పంటలు పండించవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది . అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను  అమరావతి ప్రాంత రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు . అగ్రి జోన్ వల్ల అభివృద్ధి అసాధ్యమని , రాజధాని తోనే తమ భూములకు విలువ వస్తుందని అంటున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: