ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో జగన్ మూడు రాజధానుల గురించి ప్రకటన చేసిన తరువాత రాష్ట్ర రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే. అమరావతి ప్రాంత రైతులు రాజధానిని అమరావతి నుండి తరలించవద్దని కొన్ని రోజుల నుండి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రైతుల ఆందోళనకు మద్దతు ఇస్తోంది. తాజాగా సీనియర్ ఎన్టీయార్ కూతురు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి రైతుల ఆందోళనలకు మద్దతు తెలపటంతో పాటు చంద్రబాబుతో కలిసి రాజధాని గ్రామాలలో పర్యటించారు. 
 
తన ఖరీదైన రెండు గాజులను అమరావతి పరిరక్షణ సమితికి భువనేశ్వరి విరాళంగా ఇచ్చారు. గతంలో ఎప్పుడూ రాజకీయ కార్యక్రమాలకు పెద్దగా హాజరు కాని భువనేశ్వరి అకస్మాత్తుగా ఇలా రైతుల పోరాటంలో పాల్గొనటానికి రాజకీయపరమైన కారణాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తరువాత పార్టీని నడిపించేవారు ఎవరనే ప్రశ్న చాలా కాలం నుండి వినిపిస్తోంది. 
 
తెలుగుదేశం పార్టీని లోకేష్ నడిపిస్తాడని తెలుగుదేశం పార్టీ శ్రేణులు తొలుత భావించినా లోకేష్ మాటతీరు వలన లోకేష్ పై విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలను తిప్పికొట్టడంలో విఫలమైన లోకేష్ 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో, నేతల్లో లోకేష్ పార్టీని నడిపించగలడనే నమ్మకం కలగలేదు. చంద్రబాబు రిటైర్మెంట్ తరువాత పార్టీని నడిపించటానికే భువనేశ్వరిని రంగంలోకి దింపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
చంద్రబాబు భార్య భువనేశ్వరికి మంచి వాగ్దాటితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఎన్టీయార్ కూతురు అనే గుర్తింపు కూడా ఉంది. ముఖ్యంగా మహిళలను భువనేశ్వరి ప్రసంగాలు ఆకట్టుకుంటున్నాయి. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో భరోసా కల్పించాలంటే భువనేశ్వరిని తెరపైకి తీసుకొనిరావడమే కరెక్ట్ అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఆధారంగానే భువనేశ్వరి రైతుల ఆందోళనలో పాల్గొందని సమాచారం. చంద్రబాబు లోకేష్ పై నమ్మకం లేకపోవటం వలనే భువనేశ్వరిని తెరపైకి తీసుకొచ్చారా అనే విషయం తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: