దేశవ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తరాది వణికిపోతోంది. దీనికి తోడు ఉత్తరాఖండ్, పంజాబ్, హ్యనా సహా  పలుప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. మరోవైపు.. చెన్నై, హైదరాబాద్‌లలో  అపుడపుడు వర్షం కురుస్తోంది. 

 

కొత్త సంవత్సరంలో చలి పులి గాండ్రిస్తోంది. ఢిల్లీ వాసులను గజగజా వణికిస్తోంది.సాదారణ స్థాయికన్నా అత్యల్పస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో..  జనం బెంబేలెత్తుతున్నారు. చలిమంటలు, స్వెట్టర్లు, రగ్గులతో కాలక్షేపం చేస్తున్నారు. మరోవైపు ఉత్తరాదిలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అసోం, మేఘాలయ, బెంగాల్, కశ్మీర్  సహా పలు రాష్ట్రాలు చలితో గడ్డకడుతున్నాయి. లద్దాఖ్, కశ్మీర్లో మంచు అధికంగా రాలే ప్రమాదముందని తెలుస్తోంది. రాత్రుళ్లు మరింతగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..  జనాన్ని భయపెడుతున్నాయి.

 

మధ్య భారతంలోని పలుప్రాంతాల్లో భారీవర్షాలు నమోదవుతున్నాయి. ప్రధానంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఇక సెంట్రల్, ఈస్టర్న్,  నార్త్ ఈస్ట్, సౌతిండియాల్లో ఈ రోజు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ వెల్లడించింది. శుక్రవారం.. మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో 25  నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశముందని నివేదిక తెలిపింది.  నిన్న న్యూఇయర్ రోజున చెన్నైలో భారీ వర్షం కురిసింది. కర్ణాటక, కేరళ ,  ఆంధ్రప్రదేశ్‌ల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది.

 

ఈ నెల 5వ తేదీవరకూ చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ నివేదిక వెల్లడించింది. నేడు, రేపు ఉత్తర, మధ్య, ఈశాన్య భారతంతో పాటు  దక్షిణాదిలోనూ ఉరుములతో వర్షాలు కురిసే అవకాముందని రిపోర్టు వెల్లడించింది. ప్రధానంగా కోస్తాంధ్ర, తెలంగాణ, యానాంల్లో వర్షసూచన వెలువరించింది. చత్తీస్ గఢ్‌కు  భారీవర్ష ప్రమాదం పొంచి ఉందని తెలిపింది. జమ్మూకాశ్మీర్‌లో స్నోఫాల్ అధికంగా ఉంటుందని వెల్లడించింది. మొత్తానికి చలిదెబ్బకు దేశం వణుకుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: