వాళ్లిద్దరి మధ్య వివాదం మళ్లీ ముదురుతోంది..! ఒకరి పేరు చెబితే మరొకరు కయ్యమంటున్నారు..! వాళ్లిద్దరికీ కొత్త సంవత్సరం కూడా ఫైటింగ్‌తోనే మొదలయ్యింది..! అధికార పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని సీఎం విమర్శిస్తుంటే... నా బౌండరీస్ ఏంటో నాకు తెలుసంటూ సమాధానమిస్తున్నారు లెఫ్టినెంట్ గవర్నర్. పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మధ్య అధికార యుద్ధం తారాస్థాయికి చేరింది. కోర్టుల్లో కేసులు నడుస్తున్నా వీళ్లిద్దరిలో ఎవరూ వెనక్కి తగ్గడం లేదు.

 

పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం కావడంతో ఇక్కడ మొదటి నుంచి సీఎం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ ఇష్యూ నడుస్తూనే ఉంది. లెఫ్టినెంట్ గవర్నర్‌గా తన పరిధిని మించి రోజు వారీ ప్రభుత్వ వ్యవహారాల్లో కిరణ్ బేడీ జోక్యం చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఆరోపిస్తున్నారు. కిరణ్ బేడీకి వ్యతిరేకంగా ఈయన ప్రత్యక్ష పోరాటానికే దిగారు.  గతంలో రాజ్ నివాస్ ముందు బైఠాయించి... నిరసన తెలిపిన సందర్భాలు కూడా ఉన్నాయి.  అయితే లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో కిరణ్ బేడీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ముఖ్యమంత్రి చేస్తున్న విమర్శలను పట్టించుకోకుండా... ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకుంటూనే ఉన్నారు.

 

కొత్త సంవత్సర వేడుకలు కూడా వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధంతోనే మొదలయ్యాయి. కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ  రోజూ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ కిరణ్ బేడీ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని సీఎం నారాయణ స్వామి విమర్శించారు. సంక్షేమ పథకాలు అమలులో కిరణ్ బేడీ జోక్యాన్ని నారాయణ స్వామి తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలతో కలిసి లెఫ్టినెంట్ గవర్నర్ కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారని మండిపడుతున్నారు.


 
కిరణ్ బేడీ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వంలో జోక్యంపై గతంలో ఇచ్చిన ఆదేశాలను కేంద్ర హోం శాఖ మద్రాస్ హైకోర్టులో సవాల్ చేసిందదని.. తీర్పు వచ్చే వరకు ముఖ్యమంత్రి ఓపిక పట్టాలని కౌంటర్ ఇచ్చారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని స్టేట్ ఎలక్షన్ కమిషన్ గా నియమిస్తూ నారాయణస్వామిప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను గవర్నర్ తిప్పిపంపారు. ఎవరి అధికార పరిధి ఏంటి అనేది  మద్రాస్ హైకోర్టు తేల్చే వరకు పుదుచ్చేరి సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య వివాదం సమసిపోయే సూచనలు కనిపించడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: