పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే అనుకోవాలి. అన్నింటినీ బాగా ఆలోచించే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసినట్లు అర్ధమవుతోంది. రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నంకు తరలిస్తే రాజధాని జిల్లాలైన గుంటూరు, కృష్ణా లో పరిస్ధితిలు వైసిపికి ఇబ్బందిగా మారే అవకాశాలున్నాయని  జగన్ అంచనా వేశారట.

 

ఒకవేళ నిజంగానే ఈ రెండు జిల్లాల్లో వైసిపికి దెబ్బ పడితే ఇక్కడ పడే దెబ్బను ఇతర జిల్లాల్లో  భర్తీ చేసుకోవచ్చని అంచనా వేసుకున్నారట. అందుకనే ధైర్యంగా రాజధాని విశాఖపట్నం అనే ప్రకటన చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో పై రెండు జిల్లాల్లోని 33 నియోజకవర్గాల్లో వైసిపి 29 చోట్ల గెలిచింది.  గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో 15, కృష్ణాజిల్లాలోని 16 నియోజకవర్గాల్లో 14 చోట్ల గెలిచింది. అయితే   గుంటూరు, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓడిపోయింది.

 

ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే మూడు జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో  29 నియోజకవర్గాల్లో వైసిపి గెలిచింది. విశాఖపట్నంలోని 15 నియోజకవర్గాల్లో 11, శ్రీకాకుళం జిల్లాలోని 10 సెగ్మెంట్లలో 9, విజయనగరం జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో మొత్తం వైసిపినే గెలుచుకుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీ ఏర్పాటైన దగ్గర నుండి ఉత్తరాంధ్రలో టిడిపి చాలా బలంగా ఉంది.

 

విషయం ఏమిటంటే మొన్నటి ఎన్నికల్లో ఈ ప్రాంతం, ఆ ప్రాంతమని కాకుండా ఏక మొత్తంగా వైసిపి స్వీప్ చేసింది. మరి ఇదే రకమైన ఫలితాలు వచ్చే ఎన్నికల్లో కూడా వస్తుందా అంటే చెప్పలేం.  అదే సమయంలో  అమరావతిలో జగన్ ఎంత అభివృద్ధి చేసినా మొత్తం క్రెడిట్  చంద్రబాబునాయుడుకే వెళుతుందని జగన్ భావించారట. అందులోను చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా చంద్రబాబు లాగ కలల రాజధాని పేరుతో జనాలను మోసం చేయాల్సిన అవసరం లేదని కూడా అనుకున్నారట.

 

అందుకనే బాగా డెవలప్ అయిన విశాఖపట్నాన్ని రాజధానిగా చేసుకుంటే సమస్య పరిష్కారమైపోతుందని నిర్ణయించారట. అదే సమయంలో తన ప్లాన్ ప్రకారం గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు అమరావతిని కూడా  అభివృద్ది చేయగలిగితే  జనాలు తన ఆలోచనను అర్ధం చేసుకుని ఆదరిస్తారని అనుకున్నారట. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: