రాజ‌కీయ నాయ‌కులైనా, ప్ర‌ముఖులైనా...వ్య‌క్తిగ‌త జీవితాలు ఉంటాయి. బ‌ల‌మైన అనుబంధాలు, ఆత్మీయత ఉంటుంటాయి. సామాన్యుల‌తో పాటుగా మాన్యుల‌కు సైతం ఈ భావోద్వేగాలు స‌హ‌జం. దానికి తాను సైతం అతీతుడిని కాను అని నిరూపించుకున్నారు టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌. త‌న తాత‌, నాన‌మ్మ‌పై ఉన్న మ‌మ‌కారాన్ని ఆయ‌న బ‌హిరంగంగానే చాటుకున్నారు. 

 

రెండో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్‌ మండలం మోహినికుంట జరిగిన గ్రామసభలో మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొని ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. పల్లెలు బాగుపడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం కేసీఆర్‌ మాటలను నిజం చేయాలన కోరారు. ``సిరిసిల్ల శివారుకు మిడ్‌మానేరు జలాలు చేరుకున్నాయి. రాబోయే మూడు నెలల్లో 12వ ప్యాకేజీ నుంచి నీరు తెప్పిస్తాం` అని కేటీఆర్ అన్నారు. సాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన స్పష్టం చేశారు. మల్లన్నసాగర్‌కు వెళ్లే ప్రధాన కాలువ నుంచి ఏడు గ్రామాలకు నీరందిస్తామని చెప్పారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు గ్రామాల మంత్రి, తాను పట్టణాల మంత్రిని కాబట్టి అభివృద్ధిలో తమ ఇద్దరికే పోటీ ఉంటుందన్నారు. మున్సిపల్‌ ఎన్నికలు ముగిశాక పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తామని కేటీఆర్‌ తెలిపారు. మోహినికుంటలో మా తాత, నానమ్మ పేరుపై సొంత ఖర్చుతో ఫంక్షన్‌ హాల్‌ నిర్మించి ఇస్తానని  హామీనిచ్చారు.

 


ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ…గ్రామాల్లో ప్రతి ఒక్కరూ అభివృద్దికి ముందుకు రావాలని… ఆర్థికంగానూ, శ్రమదానంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గత ఐదేళ్లుగా సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజల ముందే ఉన్నాయన్నారు. కేంద్రం నుంచి పైసా ఇవ్వకపోయినా… సీఎం కేసీఆర్ ఎన్నో ప్రణాళికలు అమలు చేస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ వస్తే కరెంట్ రాదని, రాష్ట్రం ఎడారిగా మారుతుందని ఆనాటి పాలకులు అన్న విషయాన్ని గుర్తుచేశారు. గ్రామాల్లో మహిళలు, యువకులతో కమిటీలు ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: