రాజధాని తరలింపు.. మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో మరో కీలక అడుగు పడుతోంది. రాజధాని విషయంలో అధ్యయనం చేసిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక ఈ రోజు ప్రభుత్వానికి చేరనుంది. ఇక జీఎన్ రావు కమిటీ నివేదిక.. బోస్టన్ గ్రూప్ అధ్యయనం అంశాలపై కోర్టుకెళ్లారు రాజధాని రైతులు. ఈ వ్యవహరం  ఇలా జరుగుతుండగానే.. ఉగాది తర్వాత సచివాలయ తరలింపునకు సిద్దంగా ఉండాలని అధికారులను సమాయత్తం చేస్తోంది సర్కార్. దీంతో రాజధాని ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది..? రైతులు ఏ విధంగా స్పందిస్తారనే ఉత్కంఠ నెలకొంది.  

 

రాజధాని తరలింపుపై ఆందోళనలు ఓ పక్కన కొనసాగుతూనే ఉన్నాయి. అయినా ప్రభుత్వం ఈ ఎపిసోడ్ లో తన పని తాను కానిచ్చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. ఇప్పటికే జీఎన్ రావు కమిటీ నివేదికను సిద్దంగా ఉంచుకున్న ప్రభుత్వం.. దీనిపై గత కేబినెట్ లో కూడా చర్చించింది. ఈ క్రమంలో  బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ -బీసీజీ  ఇవ్వాల్సిన పూర్తి స్థాయి నివేదిక కోసం ఎదురు చూస్తోంది ప్రభుత్వం. ఈ రోజే ఈ నివేదిక రానుండడంతో బీసీజీ రిపోర్ట్ లో ఏముంది..?  ఏం చెప్పబోతోందనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

 

ఇప్పటికే బీసీజీ ఇచ్చిన మధ్యంతర నివేదిక ప్రకారం బ్రౌన్ ఫీల్డ్ కేపిటల్ వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని రాజధానిగా ఏర్పాటు చేస్తే.. మరింత అభివృద్ధి సాధ్యం అవుతుందనేది బీసీజీ మధ్యంతర నివేదిక సారాంశం. ఈ క్రమంలో బీసీజీ ఇచ్చే పూర్తి స్థాయి నివేదికలో కూడా ఇవే అంశాలను ప్రస్తావించే సూచనలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.  

 

అయితే ఇక్కడే న్యాయపరమైున వ్యవహరాలు తెర మీదకు వస్తున్నాయి. బీసీజీ సంస్థను అధ్యయనం చేయాల్సిందిగా ప్రభుత్వం ఏ జీవో ఆధారంగా ఆదేశాలు జారీ చేసిందని.. అలాగే రాజధాని అంశంపై అధ్యయనం చేసేందుకు బీసీజీ సంస్థకున్న అర్హతలేంటీ అనే అంశాన్ని తెలపాల్సిందిగా హైకోర్టు సర్కారును ఆదేశించింది. మరోవైపు జీఎన్ రావు కమిటీ నివేదిక విషయంలో ముందుకు వెళ్లకుండా ప్రభుత్వాన్ని కట్టడి చేయాలనే అంశం కూడా కోర్టులోనే ఉంది. ఈ రెండు పిటిషన్లతోపాటు.. రాజధాని తరలింపునకు సంబంధించిన మరో రెండు  పిటిషన్లు.. మొత్తంగా నాలుగు పిటిషన్లు ఈ నెల 21వ తేదీన హైకోర్టులో విచారణకు రానున్నాయి.  ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం వేసిన హైపవర్ కమిటీ ఎలా స్పందిస్తుందోననేది ఆసక్తిగా మారింది.  

అయితే రాజధాని వ్యవహరంలో హైకోర్టు నుంచి ఎలాంటి స్టే లేనందున తమ పని తాము చేసుకునేందుకు ప్రభుత్వం ప్రిపేర్ అవుతున్నట్టు సమాచారం. కోర్టులో ఉన్న పిటిషన్లతో సంబంధం లేకుండా సర్కార్ జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికల విషయంలో అడుగులు ముందుకు వేసేందుకే మొగ్గు చూపుతోంది ప్రభుత్వం. అయితే రాజధాని ఎపిసోడ్ లో సర్కార్ దూకుడుగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకుంటే 21వ తేదీలోగానే మరోసారి కోర్టు తలుపు తట్టాలని భావిస్తున్నారు రాజధాని పరిరక్ష కమిటీ నేతలు.

 

ఈ వ్యవహరం అంతా ఈ విధంగా ఉంటే.. ఇటు ప్రభుత్వం-అటు రాజధాని రైతులు ఎవరి పని వారు చేసుకుంటూ ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. ఉగాది తర్వాత రాజధాని తరలింపు ఖాయమనే సంకేతాలు సచివాలయ ఉద్యోగులకు ఇస్తోంది ప్రభుత్వం.   ఇప్పటికే విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు చేపట్టనున్నట్టు పరోక్షంగా చెబుతున్న ప్రభుత్వం.. తాజాగా దీనికి సంబంధించిన మౌఖిక ఆదేశాలను ఉద్యోగులకు ఇచ్చేసినట్టు సమాచారం. వచ్చే నెలలో దీనికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వ పెద్దలు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.  

 

మరోవైపు బీసీజీ నివేదిక ప్రభుత్వానికి చేరడానికి ముందు... అమరావతిలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ తో భేటీ అయ్యారు సీఎం జగన్.  రాజధాని మార్పు అంశంతో పాటు  రాష్ట్రంలో తాజా పరిస్థితులను వివరించినట్లు తెలుస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: