కొత్త ఏడాది రోజున ఇరాక్ లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ మద్దతుదారులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని అంతర్జాతీయ విమానశ్రయంపై రాకెట్ దాడి జరిగింది. ఈరోజు వేకువజామున రాకెట్ దాడి జరగగా ఈ దాడిలో ఇరాక్, ఇరాన్ కు చెందిన ఎనిమిది మంది ఉన్నతస్థాయి కమాండర్లు మృతి చెందారు. ఇరాక్ మీడియా వర్గాలు ఈ దాడిలో ఇరాన్ నిఘా విభాగం ఖడ్స్ ఫోర్స్ అధిపతి జనరల్ ఖాసీం సోలెమన్ కూడా ప్రాణాలు విడిచినట్టు చెబుతున్నారు. 
 
ఇరాక్ లో ఇరాన్ మద్దతు ఉన్న తిరుగుబాటు సంస్థ పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ డిప్యూటీ కమాండర్ అబ్ మహదీ అల్ మహందీన్ కూడా మృతి చెందారు. రెండు కార్లు ఈ దాడిలో పూర్తిగా దగ్ధమయ్యాయని సమాచారం. ఇరాక్ భద్రతా వర్గాలు విమానశ్రయ కార్గో హాల్ ను మొత్తం మూడు రాకెట్లు ఢీకొట్టినట్లు చెబుతున్నాయి. ఈ దాడి ఎవరు చేశారనే దానిపై ఇంకా అధికారికంగా సమాచారం లభించలేదు. 
 
ఈ దాడికి పాల్పడింది అమెరికా బలగాలే అని ఇరాక్ పీఎంఎఫ్‌ ప్రతినిధి అహ్మద్ అల్ అస్సాది ఆరోపణలు చేశారు. ఇరాన్ లో బాగ్దాద్ తో ముడి పడి ఉన్న రెండు లక్ష్యాలపై దాడులు జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటన గురించి మరింత సమాచారం వెల్లడించడానికి అహ్మద్ అల్ అస్సాది నిరాకరించారు. ఇరాక్ పారా మిలిటరీ గ్రూప్స్ మూడు రాకెట్లతో బాగ్దాద్ విమానశ్రయంపై దాడి జరిగిందని తెలిపాయి. ఈ దాడిలో ఇరాక్ పారా మిలిటరీకి చెందిన ఆరుగురు సభ్యులు ఇద్దరు అతిథులు ఉన్నట్టు వారు పేర్కొన్నారు. 
 
ఇటీవల పలువురు నిరసన కారులు, ఇరాన్ అనుకూల మిలీషియా సభ్యులు బాగ్దాద్ లోని అమెరికా దౌత్య కార్యాలయంపై దాడులు జరపటంతో అమెరికా ప్రతీకారం తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే బాగ్దాద్ ఎయిర్ పోర్టుపై దాడులు జరిగాయి. ఈ దాడులతో మధ్య ఆసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: