తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల విష‌యంలో...ఇచ్చిన మాట నిల‌బెట్టుకుంటున్నారు. ఆర్టీసీ స‌మ్మెకు సంబంధించి ఆయన హామీలు అమ‌ల్లోకి వ‌స్తున్నాయి. ఆర్టీసీ అదికారులతో డిసెంబర్‌ 1న జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్  సంక్షేమబోర్డు ఏర్పాటుకుచర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ఇంచార్జీ ఎండీ సునీల్‌శర్మ  ఈ మేరకు  సంబంధించిన విధివిధానాలను పేర్కొంటూ సర్క్యులర్‌ జరీచేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌బోర్డును ఏర్పాటుచేసేందుకు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం సర్క్యులర్‌ జారీచేసింది.

 

తెలంగాణ‌ సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ ఉద్యోగులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సంక్షేమ బోర్డు ఏర్పాటుకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందరి సమస్యలు బోర్డు దృష్టికి రావాలనే ఉద్దేశంతోనే ఈ బోర్డులో అన్ని క్యాటగిరీల నుంచి సభ్యులకు అవకాశం కల్పించారు. ఉద్యోగులు వారి సమస్యలను సులువుగా చెప్పుకొనేందుకు వీలుగా సంక్షేమ బోర్డు సభ్యులు అందుబాటులో ఉండనున్నారు. మానవ వనరుల అభివృద్ధి, డిపోల్లో పనితీరును మెరుగుపరిచేందుకు బోర్డు సభ్యులు సహకరిస్తారు. డిపో మేనేజర్‌ నుంచి శ్రామిక్స్‌, డ్రైవర్లు, కండక్టర్ల వరకు మధ్యనున్న అంతరాన్ని సంక్షేమ బోర్డు ఏర్పాటు ద్వారా తగ్గించనున్నారు. 

 

ఈ బోర్డు విష‌యంలో ప‌లు కీల‌క అంశాలు ఉన్నాయి. ఉద్యోగుల ఫిర్యాదులను డిపో, రీజినల్‌, కార్పొరేషన్‌ స్థాయిగా డిపో మేనేజర్లు పరిశీలించి విభజిస్తారు. చార్ట్‌ సమస్యలు, జీతాలు, అలవెన్సులు, సెలవులు, రీయింబర్స్‌మెంట్‌ తదితర సమస్యలను డిపో స్థాయిగా పేర్కొన్నారు. బదిలీలు, ప్రమోషన్లు, సీనియారిటీ వంటివి రీజినల్‌ స్థాయివి. మిగతావి కార్పొరేషన్‌ స్థాయివిగా నిర్ణయిస్తారు. సూపర్‌వైజర్లతో కలిసి డిపో మేనేజర్‌ రోజువారీగా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తారు. ఫిర్యాదులపై ఫీడ్‌బ్యాక్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఫిర్యాదు పరిష్కారం కాకపోతే కారణం చెప్పాల్సి ఉంటుంది. ప్రతి సమస్యను పరిష్కరించడానికి సానుకూల దృక్పథంతో ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఉన్నత విజయాలను నమోదుచేయడంలో బోర్డు నిర్మాణం, పనితీరు కీలకం కానున్నదని సునీల్‌శర్మ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: