ఆంధ్ర ప్రదేశ్ లో మళ్ళీ ప్రాంతీయ ఉద్యమాలు పుట్టుకొచ్చే అవకాశాలున్నాయా ?, మూడు ప్రాంతాలను మూడు రాష్ట్రాలుగా విభజించాలన్న డిమాండ్ తెర పైకి వచ్చే అవకాశాలు లేకపోలేదా? అంటే అవుననే రాజధాని ప్రాంత రైతులు అంటున్నారు . అమరావతి నుంచి రాజధానిని ఇతర ప్రాంతాలకు తరలించవద్దని ఆందోళన చేస్తోన్న రైతులు ఇప్పుడు సరికొత్త  కొత్త నినాదాన్ని అందుకున్నారు . కృష్ణా, గుంటూరు జిల్లాలతో కూడిన ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు .

 

రాజధాని ప్రాంతం లో గత 17  రోజులుగా ఆందోళనలు చేస్తోన్న రైతులు , ఈ రోజు నుంచి సకల జనుల సమ్మె ను చేపట్టిన విషయం తెల్సిందే . ఈ సందర్బంగా రాజధాని ప్రాంత రైతు ఒకరు మీడియా తో  మాట్లాడుతూ  ఇన్నాళ్లు తమను రాయలసీమ ప్రాంత ముఖ్యమంత్రులే పరిపాలించారని , ఇక తమను తాము పరిపాలించుకుంటామని అన్నారు . రాయలసీమ , ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందలేదని స్థానిక ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారని , అందులో  నిజం లేకపోలేదన్న ఆయన  , మరి కృష్ణా , గుంటూరు జిల్లాలు మాత్రం ఏమి అభివృద్ధి సాధించాయని ప్రశ్నించారు . స్థానికంగా కూడా పారిశ్రామిక ప్రగతి శూన్యమని చెప్పుకొచ్చారు . ఒక్క ఉద్యోగ, ఉపాధి అవకాశాన్ని  కల్పించే పరిశ్రమ లేదని అన్నారు .

 

ఈప్రాంత ప్రజలు వందల ఏళ్లుగా వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారని , ఇంకా అదేవిధంగా బ్రతకాలా? అంటూ నిలదీశారు  . రాజధాని వస్తే తమ బ్రతుకులు మారుతాయని భావించి , భూములిచ్చామని  కానీ రాయలసీమ పాలకులు తమ ప్రాంత అభివృద్ధిని కోరుకోవడం లేదని అన్నారు . అందుకే ఆంధ్ర ముఖ్యమంత్రి తమకు కావాలంటే , ప్రత్యేక ఆంధ్ర , రాయలసీమ , ఉత్తరాంధ్ర రాష్ట్రాలను  ఏర్పాటు చేయడం ఒక్కటే మార్గమని , అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: