రాజధాని ప్రాంత రైతులకు పోలీసుల వేధింపులు పరాకాష్టకు చేరుకున్నాయి .ఇప్పటికే అర్ధరాత్రి , అపరాత్రి అన్నతేడా లేకుండా ఇళ్లపై పడి పోలీసులు వేధిస్తున్నారని రైతులు  ఆందోళన వ్యక్తం చేస్తుండగా ,  కారుణ్య మరణాలు కోరుతూ రాష్ట్రపతి కి  లేఖలు రాసిన రైతుల్ని విచారణకు హాజరుకావాలని  పోలీసులు  నోటీసులు జారీ చేయడం హాట్ టాఫిక్ గా మారింది . విచారణ నిమిత్తం  రాజధాని ప్రాంతమైన తుళ్లూరు పోలీసు స్టేషన్ కు కాకుండా , గుంటూరు జిల్లా చిలకలూరిపేట పోలీసు స్టేషన్ కు హాజరుకావాలని ఆదేశించడం పట్ల  రైతులు ఆగ్రహావేశాలను  వ్యక్తం చేస్తున్నారు  .

 

 వెలగపూడి , మల్కాపురం గ్రామాలకు చెందిన రైతులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు  , విచారణ నిమిత్తం తమ ఆధార్ కార్డు వెంట తీసుకుని   చిలకలూరిపేట పోలీసు  స్టేషన్ కు  హాజరుకావాలని పేర్కొంటూ షాకిచ్చారు  . ఇప్పటికే 15  మంది రైతులు , రైతు కూలీలకు ఈ మేరకు పోలీసుల  నోటీసులు అందాయి  .   రాజధానిని అమరావతి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించవద్దని కోరుతూ గత 17  రోజులుగా రాజధాని ప్రాంత రైతులు ఆందోళనలు , నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెల్సిందే . రోడ్లపై బైఠాయించడమే కాకుండా , వంటావార్పు కార్యక్రమాల ద్వారా  తమ నిరసనను రాష్ట్ర ప్రభుత్వానికి  తెలియజేస్తున్నారు .

 

అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం తో రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చి రోడ్డున పడ్డామని , తమకు , తమ పిల్లలిక భవిష్యత్తు లేదని పేర్కొంటూ , కారుణ్య మరణాలకు అనుమతివ్వాలని పలువురు  రాష్ట్రపతికి లేఖలు రాసి సంచలనం సృష్టించారు . రాష్ట్రపతికి ఎవరైతే కారుణ్య మరణాలకు అనుమతించాలని కోరుతూ , లేఖలు రాశారో  పోలీసులు వారికి నోటీసులు జారీ చేసి , విచారణ నిమిత్తం తమ గ్రామాలతో ఏమాత్రం సంబంధం లేని చిలకలూరి పేట పోలీసు స్టేషన్ కు హాజరుకావాలని ఆదేశించడం పట్ల అన్నదాతలు  మండిపడుతున్నారు . 
 

మరింత సమాచారం తెలుసుకోండి: