ప్రపంచంలోనే వరి దిగుబడి ఎక్కువగా ఉండే జిల్లాలు  ఏవి  అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు పశ్చిమగోదావరి. ప్రపంచంలోనే ఎక్కువ వరి దిగుబడి గోదావరి జిల్లాలోనే సాగవుతోంది. కానీ ఇప్పుడు మాత్రం గోదావరి జిల్లాల్లో  వరి  సాగు రోజురోజుకు కనుమరుగైపోతుంది. ఎందుకంటే కృష్ణతో పాటు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. వ్యవసాయ ఖర్చులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో రైతులు అందరు తీవ్ర నష్టాల పాలవుతున్నారు.దీంతో  గోదావరి జిల్లాల రైతులందరూ ఆక్వా కల్చర్ వైపు అడుగులు వేస్తున్నారు. వ్యవసాయంలో ఎంతో కష్టపడినప్పటికీ నష్టాల పాలవుతున్నామని విసుగు చెందిన రైతులు ఆక్వాకల్చర్ వైపు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం మత్స్య పరిశ్రమ గోదావరి జిల్లాలో విరాజిల్లుతోంది. 

 

 ఒకప్పుడు పంట పొలాలతో కనుచూపుమేర వరిసాగు కనిపించే పొలాలు ఇప్పుడు చెరువులు కుంటలు గా మారిపోయాయి. మత్స్య పరిశ్రమలో  లాభాలు ఆశ జనకంగా ఉండడంతో రైతులు కూడా ఆక్వా కల్చర్ కు అలవాటు పడుతున్నారు. ఇక గోదావరి జిల్లాలన్ని  మత్స్య పరిశ్రమ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్నాయి. మత్స్య  ఉత్పత్తుల్లో  అధికంగా దేశంలోనే నెంబర్వన్ స్థానానికి ఆంధ్రప్రదేశ్ చేరుకుంది.  రాష్ట్రంలో సంవత్సరానికి 16382 కోట్ల విలువైన మత్స్య  ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మత్య్స పరిశ్రమకు ప్రోత్సాహం అందిస్తుండడం... చేపలు రొయ్యల పెంపకం దారులకు విద్యుత్ బిల్లులో కూడా వైసీపీ ప్రభుత్వం రాయితీలు ఇస్తుండడం.. కేవలం 7 రూపాయలు విలువైన విద్యుత్  యూనిట్ ను   నామమాత్రంగా 1.5 రూపాయలకి అందిస్తూ  మత్స్య పరిశ్రమ అభివృద్ధికి జగన్ సర్కార్ దోహదపడుతుండటంతో ... రైతులందరూ వ్యవసాయం చేసి నష్టాల పాలు అవ్వడం కంటే మత్స్య పరిశ్రమలు స్థాపించి లాభాల బాటలో నడవడం మేలు అంటూ ఆకర్షితులవుతున్నారు. 

 

 

 ఇకపోతే కేంద్రమంత్రి హర్ సిమ్రత్  కౌర్ బాదల్ గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ భీమవరంలోని తుందురు గ్రామంలో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ మెగా ఫుడ్ పార్క్ మొదటిది కావడం గమనార్హం. అయితే సెప్టెంబర్ నెలలో గ్రీన్ ట్రిబ్యునల్.. ఫుడ్ పార్క్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశించింది. దీంతో ఫుడ్ పార్క్ వల్ల తలెత్తే కాలుష్య సమస్యలపై  దృష్టి సారించింది ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఆక్వా కల్చర్ ద్వారా రైతులు లాభాలు గడిస్తున్నప్పటికీ భూగర్భ జలాలు మాత్రం కాలుష్యం అవుతున్నాయని తెలుస్తోంది. దీనివల్ల జన  జీవనానికి ఆటంకం కలుగుతుందని.. ఈ భూములన్నీ కనీసం దేనికి పనికిరాకుండా పోతాయి అని పర్యావరణవేత్తలు పేర్కొన్నారు. ఇకపోతే మత్స్య శాఖకు అలవాటుపడ్డ రైతులందరూ వ్యవసాయం వైపు అసలు తిరిగి కూడా చూడటం లేదు. ఒకప్పుడు వరి సాగులో నెంబర్ వన్ గా ఉన్నా గోదావరి జిల్లాల్లో  ఇప్పుడు కనీసం వరి సాగు  కూడా లేక వెలవెలబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: